Tuesday, November 26, 2024

Rains Effect – నెల ముందే యాసంగి సాగు … ప్ర‌ణాళిక‌లు సిద్ధం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : యాసంగి పంట కాలాన్ని మూడు నుండి నాలుగు వారాలు ముందుకు జరపడం మూలంగా అకాల వర్షాలకు పంట నష్టపోకుండా రైతులను కాపాడొచ్చని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. యాసంగి వరి పంట కోతల ఆలస్యం మూలంగా అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, ఆ నష్టం రైతుకే కాకుండా ప్రభుత్వంపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని ఉపసంఘం స్పష్టం చేసింది. ఈ నష్టాన్ని నివారించేందుకు , యాసంగి పంట కాలాన్ని ముందుకు జరిపేందుకు ఏ రకమైన విధానాలు అవలంభించాలో సలహాలు, సూచనలతో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది. మార్చి నెలాఖరుకు వరకు యాసంగి పంట కోతలు పూర్తయ్యేలా రైతులను చైతన్యం చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. ఈ నెల 18న జరిగిన కేబినెట్‌ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం సచివాలయంలో జరిగింది.

కేబినెట్‌ ఉప సంఘం సభ్యులు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. యాసంగి పంట కాలాన్ని ఒక నెల ముందుకు జరపాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వెంటనే మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. యాసంగిలో సాగు యాజమాన్య పద్దతులు, తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే వరి రకాల సాగు, ఇతర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. యాసంగి పంట కాలం ముందుకు జరపే అంశంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులతో, అధికారులతో మంత్రి వర్గ ఉపసంఘం విస్తృతంగా చర్చించింది. తదుపరి సమావేశంలో ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని అధికారులను సబ్‌ క మిటీ ఆదేశించింది.

విత్తనోత్పత్తి రాష్ట్రంగా తెలంగాణ…
తెలంగాణ విత్తనోత్పత్తి రాష్ట్రంగా ఆవిర్భవించాలని, అందుకు రైతులు ఆహార, వాణిజ్య పంటల సాగు నుండి విత్తన పంటల సాగు వైపు మళ్లాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. విత్తన పంటలకు తెలంగాణ ప్రాంతం శ్రేష్టమయినదని, దాని మీద రైతాంగం దృష్టి సారించాలన్నారు. విత్తన పరిశోధనా ఫలితాలు రైతుకు చేరినప్పుడే ఆ పరిశోధనలకు సార్ధకత అని స్పష్టం చేశారు. ఆ మేరకు రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో విత్తన మేళా -2023ను బుధవారం ప్రారంభించారు. విత్తన నిల్వలకు, నాణ్యమైన దిగుబడులకు తెలంగాణ నేలలు అనుకూలమన్నారు. విత్తనరంగం ద్వారా దేశంలో పురోభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలదొక్కుకుంటున్నామన్నారు. సోయాబిన్‌ విత్తనోత్పత్తిని రాష్ట్రంలో ప్రోత్సహించాలన్నారు. 45 రకాల విత్తనాలను రైతులకు మేళాలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా వ్యవసాయం మనుగడ సాగదని, భూసారం పెరిగేలా పచ్చిరొట్ట ఎరువులు వినియోగించాలన్నారు. నీటికొరత, పశుగ్రాసం కొరతతో పాడి పశువుల పెంపకం తగ్గిపోయిందని, వాటి పెంపకం పెరిగితే క్రమంగా భూసారం పెరుగుతుందన్నారు. దేశంలో యాసంగిలో 94లక్షల ఎకరాల్లో వరి సాగయితే ఒక్క తెలంగాణలో 56 లక్షల ఎకరాల్లో సాగయిందన్నారు. వరి, మొక్కజొన్న, జొన్న సహా 10 రకాల పంటల విత్తనాలు వ్యవసాయ విశ్వ విద్యాలయం విక్రయిస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement