వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో మరో మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని వెదర్ రిపొర్ట్స్ విడుదల చేసింది. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం, అక్కడి నుంచి కేరళ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దాని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఉత్తర, ఈశాన్య తెలంగాణలోని కొన్ని చోట్ల వడగళ్ల వాన పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ వేగంతో గాలులు వీచే అవకాశం ఉదని వివరించింది. నిన్న ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. రాష్ట్రంలో అత్యధికంగా వికారాబాద్ జిల్లా మొయిన్‌పేటలో 31.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పలు చోట్ల పంటలు దెబ్బతినగా.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. పిడుగుపాటుకు ఇద్దరు బలయ్యారు.