హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కావాల్సిన పలు విమానాలను అధికారులు దారి మళ్లిస్తున్నారు. వాతావరణంలో మార్పుల వల్లే విమానాలను దారి మళ్లిస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా రాజమండ్రి – హైదరాబాద్, ఢిల్లీ- హైదరాబాద్ విమానాలు బెంగళూరుకు మళ్లిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే పాట్నా- హైదరాబాద్ విమానం విజయవాడకు మళ్లించినట్టు సమాచారం.
ఇక.. అంతకుముందు హైదరాబాద్ సిటీలో సాయంత్రం నుంచి కొన్ని ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. మీర్‌పేట, బడంగ్‌పేట్, బాలాపూర్, గుర్రంగూడ, ఎల్బీనగర్, సంగారెడ్డి, బీహెచ్ఈఎల్ , ఉస్మానియా యూనివర్సిటీ, రాంనగర్, ఉప్పల్, నాచారం పరిధిలోనూ వర్షం కురిసింది. రాత్రి 9 గంటల తర్వాత బంజారాహీల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో ఉదయం నుంచి ఉక్కపోతకు గురైన ప్రజలకు వెదర్ కూల్ కావడంతో కాస్త రిలీఫ్ పొందారు. మరోవైపు అబ్ధుల్లాపూర్‌మెట్‌లోని కాటమయ్య ఆలయంపై పిడుగు పడింది. దీని ధాటికి ఆలయ గోపురం పై భాగం ధ్వంసమైంది. పిడుగుపడిన సమయంలో ఆలయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.