‘అసాని’ తుపాను ప్రభావంతో తెలంగాణలో వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద, పొలాల్లో ఆరబోసిన ధాన్యం తడిచిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాష్ట్రంలోని పలు చోట్ల వర్షం పడింది. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొత్తపల్లిలో 2.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
మరోవైపు ‘అసాని’ తుఫాన్ బుధవారం సాయంత్రానికి మచిలీపట్నం-నరసాపురం మధ్య తీరం దాటింది. దీంతో మచిలీపట్నం, నరసాపురం సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. తీరం దాటిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఈశాన్యంగా యానాం, కాకినాడ, తుని వరకు తీరం వెంబడి పయనిస్తూ గురువారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం, కాకినాడ వద్ద సముద్రంలో కలిసే అవకాశం ఉందని పేర్కొంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోస్తాలో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు, కొద్ది ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల తీరాల్లో అలలు ఎగసిపడుతున్నాయి.