Sunday, November 17, 2024

వర్ష బీభత్సం.. తడిసి ముద్దయిన ధాన్యం

నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుండి శనివారం తెల్లవారు జామున వరకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వరి ధాన్యం కోతలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని కోటగిరి, వర్ని ఎడపల్లి తదితర మండలాల్లో ముందస్తుగా వరి నాట్లు వేసుకోవడంతో మార్చి చివరాంతంలోనే వరి పంట చేతికి అందింది. యంత్రాలతో వరినుర్పిడులు కొనసాగడంతో రైతన్నలు ధాన్యాన్ని వ్యవసాయ క్షేత్రాల్లో, రహదారులపై ఆరబెట్టుకున్నారు. అర్ధరాత్రి పెద్ద ఎత్తున వర్షం పడటంతో రాత్రి నుండి రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఆరబోసిన ధాన్యం తడిసి ముద్ద కావడం రంగు మారే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధరను అందిస్తుంది. రాష్ట్రంలో నిజామాబాద్ ప్రాంతం వ్యవసాయంలో ఆదర్శవంతంగా చెప్పుకోవచ్చు. ఖరీఫ్, రభీ వరి నాట్లను ఒక నెల ముందుగా సాగు చేస్తారు. ప్రభుత్వం ఏప్రిల్ 15 నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది.

జిల్లాలో మార్చి 20 నుండి వరి కోతలు ప్రారంభమవుతాయి. మే నెలలో రాళ్ల వర్షం కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో చైతన్యవంతమైన ఈ ప్రాంత రైతాంగం ముందస్తుగా వరి పంటను సాగు చేస్తారు. రైతులు ఎంత చైతన్యవంతులైన ప్రకృతి వైపరీత్యాలకు చిక్కకుండా ఎత్తుగడలు వేస్తూ పంటలు సాగుచేసిన వరుణదేవుడు కన్నెర్ర చేయడంతో రైతాంగానికి నష్టాలు కష్టాలు చూడటం తప్పడం లేదు. రాత్రి కురిసిన వర్షానికి రైతన్నలు పడరాని పాట్లు పడుతున్నారు. తడిసి ముద్దయిన ధాన్యాము చూసి రైతులు కన్నీరు కారుస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల పట్ల కరుణ చూపి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు భయపడే చేతికందిన ధాన్యాన్ని ఇప్పటికే చాలామంది రైతులు అయిన కాడికి దళారులకు అమ్ముకొన్నారు. ప్రభుత్వం రెండు వేల పైచిలుకు మద్దతు ధర అందిస్తుంటే దళారులు మాత్రం 1700 రూపాయలకు క్వింటాలు ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు ఐదు కిలోలు తరుగు పేరిట దోచేసుకుంటున్నారు.

పంటల బీమా పగడ్బందీగా అమలు చేయాలి..
మండల బీమా పథకాన్ని పగడ్బందీగా అమలుపరచి ప్రకృతి కన్నెర్ర చేసిన సందర్భాల్లో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా పంటల బీమాను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు పంటలు సాగుచేసిన సమయంలో వంట బీమా డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించినప్పటికీ నిబంధనల మేరకు 5000 ఎకరాలు వంట నష్టపోతేనే రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామంటూ భీమా కంపెనీలు రైతులకు మొండి చేయి చూపిస్తున్నాయి. ప్రతి చిన్న వ్యాపారికి ప్రతి చిన్న వాహనానికి బీమాతో ధీమా ఉన్నప్పటికీ రాత్రింబవళ్లు తమ ప్రాణాలను లెక్కచేయకుండా వ్యవసాయాన్ని సాగిస్తున్న రైతాంగ పంటలకు మాత్రం పంటల బీమా తో ధీమా లేకుండా పోయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధువుడిగా రైతులు భావిస్తున్నారు. రైతుబంధు ఉచిత విద్యుత్తు, రైతు బీమా ఇలాంటి పథకాలు ఎంతోకొంత రైతులకు రక్షణ కల్పించిందని చెప్పుకోవచ్చు. పంటల బీమా అమల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన పద్ధతులను అవలంబించే విధానాలను అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement