– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
వందే భారత్‌తో సహా అన్ని రైళ్లలో ఏసీ చైర్ కార్లు, ఎగ్జిక్యూటివ్ క్లాసెస్, అనుభూతి అండ్ విస్టాడోమ్ కోచ్‌లు ఉన్నవాటిలో ఆక్యుపెన్సీని బట్టి 25 శాతం వరకు చార్జీలు తగ్గించనున్నట్లు రైల్వే బోర్డు ఇవ్వాల (శనివారం) కొద్ది సేపటి క్రితం వెల్లడించింది. ఈ చార్జీలు కూడా ప్రయాణికుల రద్దీని బట్టి మారుతూ ఉంటాయని స్పష్టం చేసింది. వసతి సౌకర్యాల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేసే ఉద్దేశంతో రైళ్లలో ఏసీ సీటింగ్‌తో కూడిన రాయితీ చార్జీల పథకాలను ప్రవేశపెట్టేందుకు రైల్వే జోన్‌ల ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌లకు అధికారాలను అప్పగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
ఈ పథకం అనుభూతి, విస్టాడోమ్ కోచ్‌లతో సహా AC సీటింగ్ వసతి ఉన్న అన్ని రైళ్లలోని AC చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ తరగతులకు వర్తిస్తుందని రైల్వే బోర్డు తెలిపింది. తగ్గింపు విషయంలో ప్రాథమిక చార్జీపై గరిష్టంగా 25శాతం వరకు ఉంటుంది. రిజర్వేషన్ చార్జ్, సూపర్ ఫాస్ట్ సర్‌చార్జ్, GST, మొదలైన ఇతర చార్జీలు వర్తించే విధంగా విడివిడిగా ఉంటాయి.
ఇక.. ఆక్యుపెన్సీ ఆధారంగా ఏదైనా లేదా అన్ని తరగతులలో డిస్కౌంట్ అందించబడవచ్చు అని రైల్వే బోర్డు వెల్లడించింది. గత 30 రోజులలో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న తరగతులు (ఎండ్-టు-ఎండ్ లేదా డిస్కౌంట్ అందించాల్సిన విభాగాలను బట్టి కొన్ని పేర్కొన్న సెక్షన్‌లలో) ఉన్న రైళ్లను పరిగణనలోకి తీసుకుంటామని కూడా రైల్వే బోర్డు తన ఆర్డర్ లో వెల్లడించింది. కాగా.. తక్షణమే తగ్గింపు ధర అమలులోకి వస్తుందని, అయితే, ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణికులకు చార్జీల వాపసు ఉండదని అధికారులు తెలిపారు. సెలవులు లేదా పండుగ ప్రత్యేకతలుగా ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్లలో ఈ పథకం వర్తించదని పేర్కొన్నారు.