బిహార్‌లోని మధుబని రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో శనివారం మంటలు చెలరేగాయి. ఈ రోజు ఉదయం 9.13 గంటలకు రైలులో మంటలు పెద్ద ఎత్తున చెలరేగి పొగ వ్యాపించింది. అప్రమత్తమైన సిబ్బంది 9.50 గంటలకు మంటలను పూర్తిగా ఆర్పివేశారు. జైనగర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. ఐదు కోచ్‌లలో మంటలు చెలరేగినట్లు తొలుత వార్తలు వచ్చినా… రైల్వే తెలిపిన అధికారిక ప్రకటన ప్రకారం రైలులోని ఒక కోచ్‌లో మాత్రమే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు.
‘‘ఫైర్ జరిగినట్టు సమాచారం అందిన వెంటనే సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనను గవర్నమెంట్ రైల్వే పోలీస్, రైల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దర్యాప్తు చేస్తోంది. దీనిని రైల్వే అడ్మినిస్ట్రేషన్ చాలా తీవ్రంగా పరిగణించింది. ఉన్నత స్థాయి విచారణ చేపడుతున్నాం’’ అని ఈస్ట్ సెంట్రల్ రైల్వే తన ప్రకటనలో పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు అధికారులు తెలిపారు.