హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటన నేపథ్యంలో తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో భేటీకి ఓయూ వీసీ పర్మిషన్ ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘాల నేతలు, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో మినిస్టర్స్ క్యార్టర్స్, ఓయూ అడ్మినిస్ట్రేషన్ భవన్ ముట్టడికి యత్నించారు. మంత్రుల నివాస సముదాయం వైపు దూసుకురావడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. అదే సమయంలో ఓయూలో కూడా అడ్మిన్‌స్టేషన్ భవన్ ముందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం, పరిపాలన భవనం అద్దాలు ధ్వంసం చేయడంతో హీట్ ఇంకాస్త పెరిగింది. ఎన్‌ఎస్‌యూ వెంకట్ ఆధ్వర్యంలో ఓయూ వీసీకి గాజులు, చీరలు పంపుతున్నామని వాటిని భవనం ముందు పెట్టారు. ఈ నెల 7న ఓయూలోని విద్యార్థులతో రాహుల్ భేటీకి అనుమతి ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్ బేషరత్‌గా క్షమాపణలు చెప్పాలని, లేదంటే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
కాగా, ఈ ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు విద్యార్థి నేతలను అడ్డుకోగా.. ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. భారీగా పోలీసులు వచ్చి విద్యార్థి సంఘం నాయకులు మానవతరాయ్, దయాకర్ తదితరులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల అరెస్టు అంశాన్ని తెలుసుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. అరెస్టయిన విద్యార్థులను పరామర్శించారు. రాహుల్‌గాంధీకి ఓయూ రావడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని పోలీస్ అధికారులను జగ్గారెడ్డి కోరారు. అదే సమయంలో ఓయూలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో వీసీ కార్యాలయం ముట్టడికి యత్నించిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి బంజారాహిల్స్ పీఎస్ నుంచి బయటికి వస్తుండగా.. జగారెడ్డిని పీఎస్‌లో అరెస్టు చేసి నిర్భందం చేశారు. జగ్గారెడ్డి అరెస్టును కాంగ్రెస్ నేతలు ఖండించడంతో పాటు మాజీ మంత్రి గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ తదితరులు బంజారాహిల్స్ పీఎస్‌కు వెళ్లి జగ్గారెడ్డిని పరామర్శించారు.