కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యానాలోకి ప్రవేశించింది. కాగా ఈ యాత్రలో రాహుల్ గాంధీకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీనిపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయా ట్వీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ట్వీట్ ను డిలీట్ చేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు కేంద్ర మాజీ మంత్రి భన్వర్ జితేంద్ర సింగ్ అహిర్వార్ కూడా పాల్గొన్నారు. ఆయన వెంట కలిసి నడిచారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఒక్క సారిగా ఆగిపోయారు. తన షూ లో ఏదో సమస్య వచ్చిందని చెప్పారు. దీంతో జితేంద్ర సింగ్ మోకాళ్లపై కూర్చొని షూ లేస్ సరి చేసినట్టు వీడియోలో కనిపిస్తోంది. కొన్ని సెకన్ల తరువాత ఆ పాదయాత్ర మళ్లీ కొనసాగింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. మాజీ కేంద్ర మంత్రి భన్వర్ జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీ షూలేస్‌లను కట్టడానికి మోకరిల్లారు.
కానీ రాహుల్ గాంధీ అహకారంగా తన షూ లేస్ తానే కట్టుకోకుండా, అతడికి సాయం చేయకుండా వీపు తడుముకుంటున్నాడు అని పేర్కొన్నాడు. కొంత సమయం తరువాత మళ్లీ ఖర్గే జీ ఇదేం పద్దతి కాంగ్రెస్‌లో తరాలకు కొరతలేదు అని హిందీలో ట్వీట్ చేశారు. అమిత్ మాలవీయాపై ట్వీట్ పై సుప్రియా శ్రీనాటే కూడా స్పందించారు. రాహుల్ గాంధీకి లేస్ లేని షూ ఉందని తెలిపారు. హే ఫేక్ న్యూస్ పెడ్లర్ అమిత్ మాలవీయ. ఇదిగో లేస్ లేని రాహుల్ గాంధీ షూ ఫోటో అంటూ ఆ ఫొటోను ఆమె షేర్ చేశారు. మీరు మరోసారి అబద్ధాలు చెబుతూ పట్టుబడ్డారు. కానీ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పీఎం మోడీ మీకు ప్రతిరోజూ అబద్ధాలు చెప్పే అధికారం ఇచ్చారు. కాబట్టి మీరు ముగ్గురూ రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి అని ట్వీట్ చేశారు. నకిలీ వార్తల సూత్రధారి అమిత్ మాల్వియా మరో ట్వీట్ లో మీ ట్వీట్‌ను తొలగించండి. భారత్ జోడో యాత్ర సక్సెస్‌తో మీకు పిచ్చి పట్టిందా అని నిలదీశారు.