కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. కన్యాకుమారి నుంచి జాతీయ పతాకం చేబూని తొలి అడుగు వేశారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ కన్యాకుమారిలోని వివేకానంద మెమోరియల్‌ను సందర్శించారు. మిలే కదం…జుడే వతన్ నినాదంతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్, చత్తీస్‌ఘఢ్ సీఎం భూపేష్ భాఘేల్ సహా పలువురు నేతల సమక్షంలో గాంధీ మంటపం నుంచి పాదయాత్ర ప్రారంభించారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 150 రోజుల పాటు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. రాహుల్ వెంట పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో కూడిన 117 మంది బృందం పాదయాత్రలో పాలుపంచుకుంటుంది. నరేంద్ర మోడీ వైఫల్యాలను ఎండగడుతూ భావసారూప్యం కలిగిన శక్తులతో చేయిచేయి కలుపుతూ 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది.