దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ లో ఇకపై ఎన్నికల ప్రచారం, ఎలాంటి సభలూ నిర్వహించబోనని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల పెరుగుతున్న కొవిడ్ కేసులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడంపై కలిగే అనర్థాలపై లోతుగా ఆలోచించాలని ఇతర రాజకీయ పార్టీల నేతలను సైతం రాహుల్ కోరారు. మిగతా రాజకీయ నాయకులందరూ తనలాగే ఎన్నికల సభలను రద్దు చేసుకోవాలని సూచించారు.
కాగా, మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది విడుతలుగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు విడుతల పోలింగ్ పూర్తి కాగా.. ఈ నెలలో మరో మూడు విడుతల పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీలు పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారీ సభలు నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా శనివారం పశ్చిమ బెంగాల్‌లో 7,713 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 34 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 45,300 ఉన్నాయి.