అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్. ఆయనకు భార్య, ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. చాలా కాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. రెగ్యులర్ గా ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆయన నివాసానికి వెళ్లి నివాళి అర్పించారు. శరద్ యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన కుమార్తెను ఓదార్చారు.
ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ.. ఒక కారులో ఇద్దరం కలసి ప్రయాణించామని, అప్పుడే ఆయనతో తనకు అనుబంధం ఏర్పడిందని చెప్పారు. తన నానమ్మ ఇందిరాగాంధీతో అప్పట్లో విపక్ష నేత అయిన శరద్ యాదవ్ కు రాజకీయపమైన విభేదాలు ఉండేవని… అయినప్పటికీ ఇద్దరి మధ్య గౌరవప్రదమైన అనుబంధాలు ఉండేవని చెప్పారు. ఎదుటి వ్యక్తుల గౌరవానికి భంగం కలిగేలా శరద్ యాదవ్ ఎప్పుడూ ప్రవర్తించలేదని రాహుల్ అన్నారు. రాజకీయాల్లో ఇది అత్యంత ముఖ్యమైనదని చెప్పారు. ఆయన నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. దేశానికి శరద్ యాదవ్ చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు.