తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవ్వాల (శనివారం) ఓ ట్వీట్ చేశారు. తన సందేశాన్ని రాహుల్ గాంధీ తెలుగులోనే విడుదల చేయడం గమనార్హం. కాగా, రాహుల్ గాంధీ సందేశాన్ని మాజీ మంత్రి కొండా సురేఖ షేర్ చేశారు.
తెలంగాణ ప్రజలకు పంపిన సందేశంలో పోరాట స్ఫూర్తిని అట్లనే కొనసాగించాలని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ. భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంకెళ్ల విముక్తి కోసం… తెలంగాణ రైతాంగ పోరాటంతో మొదలుపెట్టి.. భారత సైన్యం సహాయంతో సాధించి.. త్రివర్ణ పతాకాన్ని తెలంగాణ ప్రజలు ముద్దాడిన దినం.. అదే స్ఫూర్తిని ఎప్పటికీ కొనసాగించాలని ఆశిస్తూ.. తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు అంటూ రాహుల్ తన సందేశంలో పేర్కొన్నారు.
కాగా, నిన్న రాత్రి రాహుల్ గాంధీ తన పాదయాత్ర (భారత్ జోడో)లో భాగంగా కేరళ రాష్ట్రం, కొల్లాంలోని కరునాగపల్లి సమీపంలో మాతా అమృతానందమయిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాతా అమృతానందమయి తన ఆశీస్సులు అందించారు. దీనిపై రాహుల్ సంతోషం వ్యక్తం చేశారు. అమ్మను కలిసి ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.