– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఒప్పందంలో భాగంగా మొత్తం 36 విమానాల డెలివరీ పూర్తి కానుంది. ఇందులో భాగంగా డిసెంబర్ 15వ తేదీ నాటికి భారతదేశం ఫ్రాన్స్ నుండి చివరి రాఫెల్ ఫైటర్ జెట్‌ను అందుకోనుంది.. భారత వైమానిక దళం (IAF)తో పాటు.. నౌకాదళంలోనూ భారతదేశం-నిర్దిష్టమైన ఆయుధ సంపత్తిని మెరుగుపరుచుకుంటోంది. అందులో భాగంగా ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు ల్యాండ్ ఫైట్ చేసేందుకు తయారు చేసిన ఈ లేటెస్ట్ వార్ జెట్ అయిన రాఫెల్‌ని ఉపయోగించనున్నట్టు రక్షణ అధికారులు చెబుతున్నారు.
భారతదేశం 36 రాఫెల్ విమానాల కొనుగోలు చేయడానికి ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో 35 ఇప్పటికే డెలివరీ అయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని అంబాలా, హర్యానా, హసిమారాలో ఈ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇక.. 36వ ఎయిర్‌క్రాఫ్ట్ ను డెవలప్మెంట్ యాక్టివిటీస్‌కు ఉపయోగిస్తున్నందున దాని అన్ని విడిభాగాలు, ఇతర భాగాలను ఫ్రాన్స్ భారతదేశానికి అందిస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా, మొదటి బ్యాచ్ రాఫెల్ జెట్‌లు 2020, జులై 29 భారతదేశానికి వచ్చాయి. భారత వైమానిక దళం కూడా విమానాలను అత్యున్నత ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేయడం ప్రారంభించింది. వాటిని అన్ని దేశంలోని అన్ని ప్రాంతాల్లో మోహరించనుంది. రాఫెల్ అనేది ఫోర్త్, ఫిఫ్త్ జనరేషన్ కి చెందిన విమానం. ఇది సుదూర శ్రేణి ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు ఎర్త్ కి క్షిపణులతో పాటు అధునాతన రాడార్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది.
ఫ్రెంచ్ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్ 75 శాతానికి పైగా ఈ విమానాల తయారీలో పాలుపంచుకుంది. చైనాతో వివాదం ఉధృతంగా ఉన్న సమయంలో రాఫెల్‌ను భారత వైమానిక దళంలోకి చేర్చారు. అది దేశంలోకి వచ్చిన వారంలోనే లడఖ్‌లో పనిచేయడం ప్రారంభించింది. IAF త్వరగా లాంగ్ రేంజ్ మెటియర్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను అలాగే స్కాల్ప్ ఎయిర్ టు గ్రౌండ్ క్షిపణులను ఆపరేట్ చేయడం ప్రారంభించింది. IAF రాఫెల్ ఆయుధాగారంలో HAMMER క్షిపణిని చేర్చారు. ఎందుకంటే ఇది తక్కువ దూరంలో కచ్చితమైన దాడులను చేసి టార్గెట్‌ని అటాక్ చేస్తుందని తెలుస్తోంది.