Thursday, November 21, 2024

కుందేలు, తాబేలు.. ర‌న్నింగ్ రేస్‌.. ఈ తరానికి తెలియాల్సిన అసలు స్టోరీ ఏంటంటే..

చిన్న‌ప్ప‌డు స్కూళ్లో టీచ‌ర్లు స‌ర‌దాగా చెప్పిన కుందేలు.. తాబేలు ర‌న్నింగ్ స్టోరీ గురించి దాదాపు అంద‌రికీ తెలిసే ఉంటుంది.. కానీ, ఆ క‌థ‌కు సంబంధించి స‌గం స్టోరీనే రివీల్ చేశార‌ని, మిగ‌తా స‌గం ఏంట‌న్న‌ది చెప్ప‌లేద‌ని తెలుస్తోంది. ఎందుకంటే దాంట్లో పోటీత‌త్వం గురించి చెబుతూ గ‌ర్వం ఉండ‌కూడ‌ద‌న్న నీతి సూత్రం ఉండేలా ఆ క‌థ‌ను మ‌లిచార‌ని.. అస‌లు క‌థ వేరే ఉందంటూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో మ‌రో స‌రికొత్త స్టోరీ ప్ర‌చారంలో ఉంది.. ఇంత‌కీ కుందేలు, తాబేలు అస‌లు క‌థ ఏంటో చ‌దివేద్దామా..!

ఒక అడవిలో చెంగు చెంగున ఎగిరే కుందేలు ఉంటుంది. అది ఒకసారి తాబేలు చూసి విస్తుపోతుంది. ఏం బావా నీలా ఇంత మెల్లగా నడిచేవారిని నేను ఎవరినీ చూడలేదు. ఇట్లైతే ఎట్లా బావా అని హేళన చేస్తుంది.. దాంతో తాబేలుకు తిక్కరేగి ఎహె.. ఎగిరి దుంకుతావన్న మిడిసిపాటు వద్దు బావా.. నీకంత అదిగా ఉంటే నాతో రన్నింగ్ రేస్ పెట్టుకుని చూడు. ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ సవాల్ విసురుతుంది. ఆ సవాలును యాక్సెప్ట్ చేసిన కుందేలు.. సరే ఇక్కడి నుంచి అడవి అవతల ఉన్న మర్రి చెట్టు దగ్గరిదాకా టార్గెట్ పెట్టుకుందాం. ఎవరు ముందు వెళ్లి జెండా పాతుతారో వాళ్లే విన్నర్ అని పోటీ పెట్టుకుంటాయి.

అప్పుడు స్టార్ అయిన రన్నింగ్ రేస్ లో స్పీడ్ గా ఉరికిన కుందేలు రెండు కిలో మీటర్ల దూరం వెళ్లి వెనక్కి తిరిగి చూస్తుంది. కనుచూపు మేరలో కూడా తాబేలు జాడ కనిపించకపోవడంతో.. ‘‘ఈ తాబేలు బావ రావడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది.. కాస్త రిలాక్స్ అవుదాం’’ అనుకొని ఆ పక్కనే చల్లగా ఉన్న చిన్న మర్రి చెట్టు నీడలో కునుకుతీస్తుంది. తాబేలు మాత్రం అడుగులో అడుగేసుకుంటూ.. ఎక్కడా ఆగకుండా రెండు, మూడు రోజులు రేస్ కొనసాగించి టార్గెట్ చేరుకని జెండా పాతేసి విన్నర్ గా నిలుస్తుంది. ఇక్కడిదాకా అందరికి తెలిసిన కథే.. అయితే అసలు కథ ఇంకా ఉందంటున్నారు చాలామంది నెటిజన్లు.

మిగతా కథ కుందేలు కోణంలో..
అప్పటిదాకా నిద్రపోయిన కుందేలుకు మెలకువ వచ్చింది. ఇంకా తాబేలు రాలేదన్న ధీమాతో నెమ్మదిగా బయలుదేరింది. అప్పుడు దానికో చిన్న సరస్సు ఎదురయ్యింది. అది దాటి వెళ్లడం ఎట్లా అని ఆలోచిస్తుంటే అందులో పైకితేలిని ఒక దుంగ కుందేలుకు కనిపించింది. దాన్ని చూడగానే మెరుపులాంటి ఆలోచన తట్టింది. ఆ దుంగపై నించుని చెరువు దాటి ఆవలిగట్టుకు వెళ్లొచ్చు అనే ఐడియాతో చెరువు దాటేసింది.

చెరువు దాటి అలా అలా చెంగు చెంగున వెళ్తుంటే ఒక జింక కనిపించింది. ‘‘ఏంటి బ్రదర్.. ఎందుకలా లగెత్తుతున్నవ్.. ఏదైనా ప్రమాదమా అని అడగడంతో కుందేలు ఆగి అసలు విషయం చెప్పింది. తానో రన్నింగ్ రేస్ లో ఉన్నానని, కుందేలుతో జరిగిన పోటీ గురించి మొత్తం చెప్పుకొచ్చింది. దాంతో ఆ జింక.. ఈ చాలెంజ్ లో గెలిస్తే ఏమొస్తుంది ప్రశ్నించింది కుందేలును. రన్నింగ్ రేస్ లో గెలవడం వల్ల నాకు మెడల్ వస్తుంది. అన్ని జీవరాశుల కంటే నేనే గొప్ప అనే బిరుదు వస్తుంది అని గర్వంగా చెబుతుంది కుందేలు. దాంతో పాటే ప్రైజ్ మనీ కూడా ఇస్తారు.. నాక్కావాల్సిన ఫుడ్ ఈజీగా దొరికే చాన్స్ ఉంటుంది.. అంతేకాకుండా గౌరవం కూడా వస్తుంది కదా అని చెబుతుంది కుందేలు.

- Advertisement -

‘‘ఈ అడవిలో ఇంత ఆహారం ఉండగా మళ్లీ పరుగు పందెం ఎందుకు..? దానికి మెడల్ అవసరమా’’ అని ప్రశ్నిస్తుంది జింక. వందేళ్ల క్రితం ఈ ఫారెస్ట్ లో అతి వేగంగా పరుగెత్తిన మా ముత్తాత జింక పేరు నీకు తెలుసా? అతి పెద్ద ఏనుగు పేరు తెలుసా? ఈ అడవిలో బలమైన సింహం ఎవరో చెప్పు..? అని ప్రశ్నలమీద ప్రశ్నలేసి ఆలోచింపజేస్తుంది. ఈ రోజు తాబేలుతో గెలిచాక రేపు మరొక పాము, ముంగీస, గాడిద వంటివి నిన్ను సవాల్ చేస్తాయనుకో.. వాటితోను నీ సత్తా ఏంటో నిరూపించుకోవాలని పోటీ పడతావా.? అట్లయితే ఈ రన్నింగ్ రేసు నీ జీవితాంతం చేయాల్సి ఉంటుంది అని ఉచిత ఉపదేశం ఇస్తుంది.

జింక బోధనలతో రన్నింగ్ రేసులో ఉన్న కుందేలుకు దోయం అవుతుంది. ఇక అంతే.. పందెం విషయం మరిచిపోయి హాయిగా గ్రాస్ తింటూ.. రెస్ట్ తీసుకుంటుంది. ఇంతలో ఒక బాతు వచ్చి అవును కుందేలు బావ.. నువ్వు తాబేలుతో రేస్ లో ఉంటివి కదా.. మరి ఇంత రిలాక్స్ గా ఉన్నావేంటీ? అని ప్రశ్నిస్తుంది.? జింక ఉపదేశంతో తనకు అంతా తెలిసిపోయిందని.. ఈ రన్నింగ్ రేసులు గట్రా నాకు వద్దని చెబుతుంది కుందేలు. నాకు పోటీ ఎవరు లేరు.. నేను ఎవరికీ పోటీ కాను.. నాకు నేనే సాటి.. అని గర్వంగా చెబుతుంది. నా బలం ఏంటో తెలుసు.. నా బలహీనతలు ఏంటో బాగా తెలుసు.. అని సమాధానమిస్తుంది.

సూర్యుడు అలా కొండగుట్టలమీదుగా వాలిపోతుంటాడు.. సాయంత్రం అయ్యేసరికి ఓ నక్క వగరుపోస్తూ వచ్చి కుందేలుతో ‘‘ఓయ్ మిత్రమా.. ఏదో అనుకున్నాం కానీ.. ఆ తాబేలు మహా గట్టిపిండమే. ఎక్కడా ఆగకుండా రెండు రోజులు నడిచీ నడిచీ టార్గెట్ రీచ్ అయ్యింది. జెండా కూడా పాతేసింది. అదే విన్నర్’’ అని చెబుతుంది. అయితే.. గమ్యం చేరిన పదిహేను నిమిషాలకల్లా తాబేలు చనిపోయింది.. బెట్టింగ్ గెలిచి ఏం లాభం అని అసలు విషయం తెలియజేస్తుంది.

కథలో నీతి: జీవితం పరుగుపందెం కాదు.. ఏ ఒక్క విషయంలోనూ ఎవ్వరితో ఫ్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు మనం.. మన సత్తా అంటే ఏంటో తెలుసుకునేలా వర్క్ ఉండాలి. అది కమిట్ మెంట్ తో కూడినది కావాలి.. నిజాయితీ, వర్క్ కమిట్ మెంట్.. ఉంటే ఏ పనిచేసినా, ఎక్కడ ఉన్నా జీవింతంలో సంతోషంగా నెగ్గుకు రావచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement