Friday, November 22, 2024

R 5 Zone – రేపే ప‌ట్టాల పంపిణీ – ఆంక్ష‌ల వ‌ల‌యంలో అమ‌రావ‌తి..

అమరావతి, ఆంధ్రప్రభ: అమరావతి ఆర్‌-5 జోన్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి.. ఈనెల 26వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు అధికారులు అహరహం పనులు చేపడుతుంటే మరోవైపు రైతులు ఆందోళనలకు దిగుతున్నారు.. బుధవా రం రైతులకు మద్దతుగా న్యాయవాది జెడా శ్రావణ్‌కుమార్‌ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నంచేసి ఆయన్ను అరెస్టు చేశారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నెలకొంది.. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం నిర్దేశించిన ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయటం విరుద్ధమని వాదించారు. ప్రభుత్వంతో చావో రేవో తేల్చుకుంటామని నినాదాలు కూడా చేశారు. దీంతో పోలీసులు అలర్టయ్యా రు. శ్రావణ్‌కుమార్‌ను వ్యక్తిగత పూచీ కత్తుపై విడుదల చేశారు. ఆయన వ్యవస్థీకరించిన జైభీమ్‌ పార్టీ ఆధ్వర్యం లో ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని రైతులకు స్పష్టం చేశారు. ఆందోళనకు దిగితే పోలీసులు కేసులు పెడుతున్నందున సీఎం జగన్‌ పంపి ణీ చేసే కార్యక్రమం ముగిసేంత వరకు నిరసన గళాలు వినిపించేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ముఖ్య మంత్రి పర్యటన ముగిసేంత వరకు ఈనెల 26వ తేదీ సాయంత్రం వరకు అమరావ తిలో ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. ఆర్‌-5 జోన్‌తో పాటు ఎస్‌-3లో 50వేల మందికి పైగా ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లోని పేదలకు ఇళ్ల స్థలాలతో పాటు టిడ్కో ఇళ్లను కూడా ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు. వెంకటపాలెం వేదికగా పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్‌-5 జోన్‌లో పట్టాల పంపిణీని నిరసిస్తూ ఇప్పటికే కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో రైతులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. సుప్రీం కోర్టు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేయటంతో ప్రభుత్వం నివేశన స్థలాల వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు ఆర్‌-5 జోన్‌ పరిధిలోని 25 లేఅవుట్లలో మెరక, అంతర్గత రహదార్ల పనులను రాత్రిళ్లు సైతం నిర్వహిస్తున్నారు. సీఆర్‌డీఏ అధికారులు ఇక్కడే మకాం వేసి పనులు చేయిస్తున్నారు.. అవసరమైతే విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు.. ఎక్కడా అవాంఛనీయ సంఘట నలకు తావులేకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement