తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేసిన ఉద్యోగ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. పైగా వయోపరిమితిని కూడా పెంచడంతో జాబ్స్ కోసం పోటీ ఎక్కువగానే కనబడుతోంది. దాంతో తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేందుకు యువత సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కసితో తమ కలల సాకారానికి శ్రీకారం చుట్టేందుకు పోటీకి సన్నద్ధమవుతున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు.
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఉద్యోగ కుంభమేళాకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా శ్రీకారం చుట్టడంతో నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. 80వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవడంతో, అంతే వేగంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సైతం ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్నారు. కోచింగ్ పొందేందుకు హైదరాబాద్, వరంగల్‌ల్లోని కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి వరంల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులంతా కోచింగ్ తీసుకునేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి వరంగల్ నగరానికి చేరుకుంటున్నారు. అలాగే నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ తదితర జిల్లాల నిరుద్యోగ యువత హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్నారు.
హైదరాబాద్‌లో గ్రూప్స్, పోలీస్, టీచర్స్ , హెల్త్, పంచాయతీరాజ్ సెక్రటరీ, ఇతర ఉద్యోగాలకు సంబంధించిన కోచింగ్ కేంద్రాలు వరంగల్‌తో పోల్చుకుంటే హైదరాబాద్‌లోనే పేరున్న కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. దాంతో ఉత్తమ ఫ్యాకల్టీ, డైలీ టెస్టుల నిర్వహణ, స్టడీ మెటీరియల్ ఇస్తున్న సంస్థలకే ఆశావహులు ప్రాధాన్యం ఇస్తున్నారు. పరీక్ష అవగాహన కోసం కొందరు ఎక్కడైతే ఏంది.. అన్నట్లుగా ఏదోక కోచింగ్ కేంద్రాల్లో అడ్మిషన్ తీసుకుంటుంటే, మరికొందరేమో ఎక్కువ ఫీజు చెల్లించి హైదరాబాద్‌లోని పేరున్న కోచింగ్ సెంటర్లలో చేరేందుకే మొగ్గుచూపిస్తున్నారు. దాంతో కొంత మంది వరంగల్‌కు వెళ్తుంటే, ఎక్కువ మంది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు.
ఈసారి పోటీ ఎక్కువే…
వయో పరిమితిని 10 ఏళ్ల వరకు పెంచడంతో ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువగానే ఉంటుంది. టీఎస్‌పీఎస్సీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు సుమారు 26 లక్షల మంది వరకు ఉన్నారు. ఇంకా చేసుకోని వారు, గ్రాడ్యుయేట్ పూర్తి అయినవారి సంఖ్య భారీగానే ఉంటోంది. దాంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. ఈ స్థాయి జంభో నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడినకాన్నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం వేయలేదు. అటు కోచింగ్ సెంటర్లు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈసారి అభ్యర్థుల సంఖ్య పెరిగిపోతుండటంతో దానికి అనుగుణంగానే కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు అదనపు తరగతి గదులను సిద్ధం చేసుకుంటున్నారు. ఫంక్షన్ హాళ్లు, భవనాలు అద్దెకు తీసుకుంటున్నారు. అలాగే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బ్యాచ్‌ల వారీగా కోచింగ్‌లు ఇస్తున్నారు.
కోచింగ్ కేంద్రాలకు కేరాఫ్…
వివిధ పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకోవాలి. ఉద్యోగ భర్తీ ప్రక్రియ పుంజుకోవడంతో కోచింగ్ సెంటర్లు అవగాహన సదస్సులకు తెర తీశాయి. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4తో పాటు, ఎస్‌ఐ, కానిస్టేబుల్, తదితర ఉద్యోగాలకు ఎలా సన్నద్ధం కావాలనే దానిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ నిరుద్యోగులను ఆకర్షిస్తున్నాయి. స్టడీ మెటీరియల్, తమ కోచింగ్ సెంటర్‌లలో అనుసరించే బోధనా పద్ధతులు వంటివి వివరిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్, అశోక్‌నగర్, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, రాంనగర్‌లలోని కోచింగ్ కేంద్రాలు, ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లలో తిరిగి సందడి నెలకొంది. చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం నిరుద్యోగ అభ్యర్థులతో కోలాహలంగా మారింది.