హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో హిందీ పేపర్ ఔట్ అంశం ఎంత ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. వరంగల్ జిల్లా కమలాపూర్‌లోని బాలుర ఉన్నత పాఠశాలలో హిందీ పేపర్ బయటకు రావడం తెలంగాణ రాజకీయాల్లో పెనుదుమారమే లేపింది. అయితే ఈ కేసులో ఒకట్రెండు రోజుల్లో మరికొంత మంది అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం నాడు ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు , తాజాగా మరో ఐదుగురిని వరంగల్ పోలీసులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ కేసుతో సంబంధముందని అనుమానం ఉన్న వారందరికీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. అయితే హిందీ పేపర్ మొత్తం 149 మందికి వాట్సాప్ ద్వారా చేరినట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే వరుసగా నోటీసులను పంపిస్తున్నారు. ఇదే కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే బెయిల్ మీద విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఇదే కేసులో సాక్షిగా మాజీ మంత్రి,బిజెపి నేత ఈటల రాజేందర్ సోమవారం నాడు విచారణకు వరంగల్ సిపి కార్యాలయంలో హాజరయ్యారు..
ఇర ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే పేపర్ ఎవరెవరికి చేరింది? దాని వెనుకాల కుట్ర ఏమైనా దాగి ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే మరో నిందితుడైన ప్రశాంత్ దురుద్దేశంతో పేపర్ ఔట్ చేశాడా? కేవలం వాట్సాప్ ద్వారా తనకు వచ్చిన సమాచారం తెలియపరిచేందుకు మాత్రమే వివిధ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ గ్రూపులకు అడ్మిన్‌లుగా ఉన్న వారికి నోటీసులు పంపిస్తున్నట్లు సమాచారం. ఈ లీకేజీ వ్యవహారంపై ఇప్పటికే 25మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరితో పాటు అనుమానం ఉన్న మరికొద్ది మందికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. నోటీసులు అందుకున్న వారందరినీ పిలిచి ప్రశ్నిస్తున్నారు. నోటీసులు అందుకున్న వారిలో పలు పార్టీల నేతలు, కార్యకర్తలు, జర్నలిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పేపర్ ఔట్ అయిన హిందీ ప్రశ్నపత్రం సుమారు 149 మందికి చేరినట్లు పోలీసుల దర్యాప్తులో తేలడంతో వారందరికీ విచారిస్తారా? లేక అడ్మిన్‌లకు, అనుమానితులకు మాత్రమే ప్రశ్నిస్తారా? అనేది స్పష్టం కావాల్సి ఉంది.