కర్నూలు, (ప్రభన్యూస్) : జిల్లాలో మైనింగ్ గుంతలు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. అక్రమ మైనింగ్ నిర్వహణ, అలాగే ఇసుక తరలింపు వల్ల ఏర్పడుతున్న భారీ గుంతలు వర్షపునీటితో నిండి మరణ శాసనం రాస్తున్నాయి. సరదాగా ఈతకు వెళ్లిన చిన్నారులను జలసమాధి చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జిల్లాలో పదేపదే చోటుచేసుకుంటున్నా నియంత్రణకు అధికారులు అడుగులు వేయకపోవడం గమనార్హం. పాణ్యం పరిధిలోని తమ్మురాజుపల్లె కొండల వద్ద నిత్యం గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. లోతైన గుంతలు ఏర్పడుతున్నాయి.
2015 సెప్టెంబర్ 20న బేతంచర్లకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడిన విషయం పాఠకులకు విధితమే. రుద్రవరం మండలం చిలకలూరు వద్ద వక్కిలేరులో ఇసుక కోసం త్రవ్విన భారీ గుంతలో ఊట నీరు చేరింది. అక్కడ ఆడుకుంటూ వెళ్లి లోతైన గుంతలో పడి ఊపిరి ఆడక మూడేళ్ల కిందట ఇద్దరు చనిపోయారు. సెప్టెంబర్ మాసంలో డోన్ పట్టణంలో మంచినీటి పైపులైన్ లీకేజీ మరమ్మత్తులకు భారీగా గుంత తీశారు. 15 రోజుల పాటు గొయ్యి చుట్టు ఎలాంటి కంచె ఏర్పాటుచేయకపోవడంతో వర్షాలకు ఆ గుంతలో నీరు చేరడంతో మల్లికార్జున అనే చిన్నారి నీటిలో దిగి మృతిచెందారు. బేతంచర్ల పరిధిలోని కొత్తపల్లి సమీపంలో రహదారి నిర్మాణానికి 2020 సంవత్సరంలో భారీగా త్రవ్వకాలు చేశారు. ఆ చిన్నపాటి గుంత చెరువుగా మారింది. గుత్తి నుండి బేతంచర్ల వైపుకు వెళ్తున్న కారు అదుపుతప్పి అందులో పడటంతో ఊపిరి ఆడక 8 ఏళ్ల అమ్మాయి మృతిచెందింది. అక్టోబర్ మాసంలోనే ఆలూరు సమీపంలో నీటి కుంటలో ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు.
జిల్లావ్యాప్తంగా క్వారీలు ప్రమాదకరంగా మారినా కుంటల చుట్టూ కంచె ఏర్పాటుచేయాలనే నిబంధణలు చెబుతున్నా ఎవ్వరూ స్పందించడం లేదు. క్వారీ గుంతల్లోకి వర్షం నీరు చేరి ఒక్కో ప్రదేశంలో ఎక్కువ మంది మృత్యువాత పడితే అక్కడ సదరు క్వారీ యజమాని కాపలాదారులను నియమించాల్సి ఉంటుంది. అలాంటి నిబంధనలు తుంగలో తొక్కి ప్రమాదాలకు దారులు తెరుస్తున్నారు. జిల్లాలో ప్రథమంగా బనగానపల్లె డివిజన్లో అధికంగా అక్రమ క్వారీలు ఉన్నాయి. ముఖ్యంగా డోన్, బేతంచర్ల, కొలిమిగుండ్ల, బనగానపల్లె ప్రాంతాల్లో ఎక్కువగా క్వారీలు ఉన్న గ్రామాల్లో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సంఘటనలు జరిగినప్పుడు అధికార యంత్రాంగం హడావుడే తప్పా వందశాతం అమలుచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital