హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం రైతుల జీవితాల్లో ఆర్థికపరమైన గుణాత్మక మార్పుకు దోహదం చేస్తోందని తాజా అధ్యయనం తేల్చింది. రైతు బంధు పథకం అమలు తర్వాత రైతు కుటుంబాల కొనుగోలు శక్తి పెరిగినట్లు ఇటీవలి నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పంట పెట్టుబడి సాయం కింద 2018 నుంచి రెండు విడతల్లో ఏటా ఎకరానికి రూ.10వేలను రైతు బంధు పేరుతో తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం అమలు తర్వాత రైతుల కొనుగోలు శక్తి 12.9శాతం పెరిగినట్లు ఐఐఎం అహ్మదాబాద్ విద్యార్థులు నిర్వహించిన అధ్యయనం తేల్చింది.
ఆహార వినియోగం, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాల్లో రైతు కుటుంబాల జీవన ప్రమాణాలు పెరగడంలో రైతు బంధు ప్రభావం చూపుతున్నట్లు తేలింది. కొనుగోలు శక్తి పెరగడంతోపాటు వడ్డీ వ్యాపారుల వద్ద పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన విపత్కర పరిస్థితుల నుంచి కూడా రైతులకు విముక్తి కలిగించడంతో రైతు బంధు గుణాత్మక ప్రభావం చూపుతోందని తేలింది. రైతు బంధు వస్తుందన్న భరోసాతో పాసుపుస్తకాలు సాక్ష్యంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందడం కూడా రైతులకు సులువైందని ఐఐఎం – అహ్మదాబాద్ అధ్యయనం తేల్చింది. మొత్తంగా రైతు వ్యవసాయాన్ని భారంగా భావించకుండా ఇష్టంగా చేసేలా సుస్థిర వ్యవసాయానికి రైతు బంధు బాటలు వేసినట్లుగా అధ్యయన నివేదికలో పేర్కొన్నారు.
ఏటా రెండు విడతల్లో ఎకరానికి రూ.10 వేల చొప్పున 65లక్షల మంది రైతులకు రైతు బంధు కింద పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటి వరకు పలు విడతలుగా రూ.65 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. వానాకాలం, యాసంగి సాగుకు రైతు బంధు కింద పెట్టుబడి సాయం నిరాటంకంగా అందుతోంది. ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన విద్యార్థులు అభిషేక్ షా, సావన్ రాతి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.