తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ప్రోత్సాహం, త్యాగం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పేర్కొన్నారు. టోక్యో ఒలంపిక్స్ లో పతకం సాధించిన సింధు హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా ఇండియా ఏహెడ్ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సెమి ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి తో నిరాశ చెందానని అన్నారు. అయితే తన తల్లిదండ్రులు అభిమానులు ప్రోత్సాహంతో కాంస్య పతకం సాధించానని చెప్పారు. ఫిజికల్ ఫిట్నెస్ అనేది క్రీడాకారులకు చాలా ముఖ్యమని సింధు పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ఒత్తిడికి గురయ్యారని చెప్పారు. కరోనా సంక్షోభం ఉన్న తనపై అభిమానంతో ఎంతోమంది ఎయిర్ పోర్ట్ కు వచ్చి సెండాఫ్ ఇచ్చారని గుర్తు చేశారు. కరోనా నేపథ్యంలో వేడుకలకు ఇది సమయం కాదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తనను ఆశీర్వదిం చారని పేర్కొన్నారు. త్వరలో పారిస్‌లో జరగబోయే టోర్నీలో పాల్గొంటానని సింధు వెల్లడించారు. ఏపీలో అకాడమీ కోసం ప్రభుత్వం భూమి కేటాయించిందని తెలిపారు. త్వరలో అక్కడ అకాడమీ ప్రారంభిస్తామని సింధు స్పష్టం చేశారు.
టోక్యో ఒలింపిక్స్ 2020 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్య పతకం నెగ్గిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఏకైక భారత మహిళా అథ్లెట్‌గా పీవీ సింధు రికార్డు సృష్టించింది. స్వర్ణ పతకం సాధిస్తుందని అందరూ భావించినా.. సెమీస్‌లో తై జూ చేతిలో ఓడిపోయింది. కానీ ఓటమి బాధను దిగమింగి ఆ తర్వాత రోజే కాంస్య పతకం సాధించింది.