Friday, November 22, 2024

ప్రధాని మోదీతో పీవీ సింధు ఐస్ క్రీమ్ పార్టీ

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధు ఘనస్వాగతానికి భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వరుసగా రెండు ఒలింపిక్స్ పతకాలతో చరిత్ర సృష్టించిన సింధు స్వదేశం చేరుకున్న అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసే అవకాశముంది. ఈ మర్యాదపూర్వక భేటీలో ప్రధాని మోదీతో కలిసి సింధు ఐస్‌క్రీమ్ పార్టీ చేసుకోనున్నారు. టోక్యో ఒలింపిక్ క్రీడల ప్రారంభానికి ముందు.. ప్రధాని మోదీ, పీవీ సింధుతో మాట్లాడారు. ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత సింధుతో కలిసి ఐస్ క్రీం తింటానని చెప్పారు. ఈ నేపథ్యంలో సింధు స్వదేశం వచ్చిన తర్వాత మోదీతో కలిసి ఐస్ క్రీమ్ పార్టీ చేసుకోనున్నారు.

కాగా, పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన బింగ్ జియావోపై విజయం సాధించి కాంస్య పతకాన్ని గెల్చుకోవడంతో ఆమె.. వరసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఏకైక భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించారు. ఇంతవరకూ బ్యాడ్మింటన్‌ క్రీడలో భారత్ నుంచి పురుషులు కానీ మహిళలు కానీ ఆ ఘనత సాధించలేదు. కాంస్య పతకం గెలిచిన సింధును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. పీవీ సింధు భారతదేశానికే గర్వకారణమైన క్రీడాకారిణి అని శుభాకాంక్షాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement