ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 25వ రోజూ నరమేధాన్ని సృష్టించాయి. బాధిత దేశం పదేపదే శాంతి చర్చలకు పిలుపునిస్తున్నా, పుతిన్ ఖాతరు చెయ్యడం లేదు. యుద్ధోన్మాదంతో దాడుల తీవ్రతను మరింత పెంచున్నారు. యుద్ధరీతికి విరుద్ధంగా పౌరులనూ టార్గెట్ చేస్తూ, పొరుగుదేశంలో నెత్తుటేర్లు పారిస్తున్నారు. ఆదివారం మరోసారి శక్తివంతమైన క్షిపణులను ప్రయోగించిన రష్యా, ఐరోపాలోనే అతి పెద్ద ఉక్కు పరిశ్రమ అజోవ్‌స్టాల్‌పై విరుచుకుపడింది. ఇంకొకవైపు 400 మంది ఆశ్రయం పొందిన స్కూల్‌పై దాడులు చేశాయి. మేరియుపోల్‌లోని ఆర్ట్ స్కూల్‌లో ఈ ఘటన జరిగిందని ఆ నగర పాలక మండలి తెలిపింది. బాంబుల దాడిలో భవనం పూర్తిగా ధ్వంసమైందని, అందులోని శరణార్థులు శిథిలాల్లో చిక్కుకున్నారని చెప్పింది. అయితే ఎంత మంది మరణిం చారన్నది తెలియరాలేదు. మరోవైపు అజోవ్ సముద్రంలోని వ్యూహాత్మక నౌకాశ్రయమైన మేరియుపోల్‌ను రష్యా దళాలు చుట్టుముట్టాయి. ఆహారం, నీటి సరఫరాను బంద్ చేయడంతోపాటు నగరంపై బాంబు దాడులను కొనసాగిస్తున్నారు. ఆదివారం నాటి దాడుల్లో యూరప్‌లోని అతిపెద్ద ఉక్కు కర్మాగారం ధ్వంసమైంది.
మేరియుపోల్‌ను ఆధీనంలోకి తీసుకున్న శత్రుసేనలు, వారం రోజులుగా ఇక్కడ దాదులను తీవ్రంచేశాయి. ఈ నేపథ్యంలో ఇక్కడున్న ఐరోపాలోనే అతి పెద్ద ఉక్కు పరిశ్రమ అజోవ్‌స్టాల్‌పై బాంబుల వర్షం కురిపించింది. దీనివల్ల ఉక్రెయిన్‌కు భారీగా ఆర్థిక నష్టమేగాక, పర్యావరణం కూడా నాశమైందని ఉక్రెయిన్ ఎంపీ లెసియా వాసిలెంకో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉక్కు కర్మాగారంపై రష్యా బాంబు దాడుల వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. స్టీల్ ప్లాంట్‌ను రష్యా దళాలు ధ్వంసం చేయడంపై అజోవ్‌స్టాల్ డైరెక్టర్ జనరల్ ఎన్వర్ స్కిటిష్విలి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాము నగరానికి తిరిగి వచ్చిన తర్వాత ఉక్కు కర్మాగారాన్ని పునర్‌నిర్మిస్తామని తెలిపారు. అయితే పర్యావరణం దెబ్బతినకుండా ఉక్కు పరిశ్రమలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎన్వర్ తెలిపారు. బ్లాస్ట్ ఫర్నేస్‌ను సరిగ్గానే మూసేశామని, కోక్ ఒవెన్ బ్యాటరీల వల్ల స్థానికులకు ఎలాంటి ముప్పు ఉండదని వివరించారు.
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా తన యుద్ధ వ్యూహాన్ని మార్చుకున్నదని బ్రిటన్ ఆరోపించింది. రష్యా తీరుతో భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. రష్యన్ సైనికులు భీకరమైన దాడులు జరుపుతుండటంతో మరియుపోల్‌లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. దాడులు ఇలాగే కొనసాగితే పోర్టు సిటీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని ##హచ్చరించింది. రష్యాను ఎదుర్కొనేందుకు మరిన్ని ఆయుధాలు సరఫరా చేసేందుకు అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ, డిఫెన్స్ కౌన్సిల్ సెక్రెటరీ ఒలెస్కీ డానిలోవ్ ధ్రువీకరించారు. త్వరలో యూఎస్ నుంచి ఆయుధాలు రాబోతున్నాయి. ఇందులో ట్యాంక్ విధ్వంసక మిస్సైల్ జావెలిన్, స్టింగర్ మిస్సైల్స్ కూడా ఉన్నాయి. రోజుల వ్యవధిలోనే ఆయుధాలు మా దేశానికి వస్తాయని ఓ టీవీ ఇంటర్వ్యూలో ప్రకటించారు.