విజయనగరం జిల్లాలోని మహారాజ ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోయిన ఘటనపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి స్పందించారు. విజయనగరం జిల్లాలో అన్ని ఆస్పత్రులలోను ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కోవిడ్ ఆసుపత్రి లో ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. ఐసియూలో ఉన్న రోగులకు సరఫరా అయ్యే ఆక్సిజన్ పంపిణీ లో ఇబ్బంది ఉందని తెలిపారు. 15 మందిని తక్షణమే మరొక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఆక్సిజన్ సమస్య కారణంగా ఎవరూ మరణించే పరిస్థితి లేదన్నారు. తిరుమల ఆస్పత్రికి ఈ రోగులను తక్షణమే తరలించామని, పరిస్థితి ఇంకా సీరియస్ గా ఉంటే విశాఖకు తరలించాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించినట్లు వివరించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సాయంత్రానికి ఆక్సిజన్ సరఫరా సాంకేతిక సమస్యను కూడా పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి తెలిపారు.
కాగా, విజయనగరం జిల్లా కేంద్రంలోని మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు కొవిడ్ రోగులు మృతి చెందారు. అయితే బంధువులు ఆక్సిజన్ కొరత కారణంగా.. చనిపోయారని చెబుతుండగా.. ఆక్సిజన్ కొరతతో చనిపోలేదని అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి 2 గంటలకు ఆక్సిజన్ అయిపోయిందని.. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవటంతో ఐసోలేషన్ లో ఆక్సిజన్ పై చికిత్స పొందుతున్న బాధితులు అస్వస్థతకు గురయినట్లు తెలిపారు. ఈ పరిస్థితిపై ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో పాటు బాధితుల బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.
అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బంది తలెత్తిందని కలెక్టర్ హరి జవహర్ లాల్ అన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే బల్క్ సిలిండర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఘటన జరిగిన సమయంలో మొత్తం 290 మంది రోగులు ఉన్నారని…వారిలో 25 మంది ఆక్సిజన్ తో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారందరికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. వైజాగ్ నుండి మరో ఆక్సిజన్ ట్యాంకర్ తెప్పిస్తున్నామని… ఇతర పరిశ్రమల నుండి కూడా ఆక్సిజన్ తెప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆక్సిజన్ లో ప్రెజర్ తక్కువగా రావటం వల్ల ఇబ్బంది నెలకొందని కలెక్టర్ హరిజవహర్‌లాల్ వెల్లడించారు.