సుకుమార్ గారితో ఆయన తొలి చిత్రం ‘ఆర్య’ నుంచి నాకు మంచి అనుబంధం ఉంది. సుకుమార్ గారే ఓ సాహిత్య గని. ఆయన్ని సంతృప్తి పరచడం అంత సులువు కాదు. మనం ఏం రాయాలి అనే దాని మీద ఆయనకు చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనకు ఒకదాని వెనుక ఒకటి చెపుతూ వెళ్లిపోతుంటారు. చివరగా మనం ఆయన్ను మెప్పించేలా ఏదో ఒకటి చెప్పి ఆయన ప్రవాహాన్ని అడ్డుకోవాలి.
సుకుమార్ గత చిత్రాల్లో కూడా నేను పాటలు రాసినప్పటికీ.. పుష్ప సినిమాకు రాయటం చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా యాసలో ఉంటుంది. అందుకే పాటల్లో కూడా ఆ ప్రాంత యాసను వాడాల్సి వచ్చింది. సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు చిత్తూరు యాసను కష్టపడి నేర్చుకున్నారు. వారు అందులో లీనం అయిపోయిన విధానం నాకు దైర్యాన్ని ఇచ్చింది. దాంతో నేను కూడా ఆ ప్రాంత నేటివిటీకి సంబంధించిన పదాలను పట్టుకోవటంలో తీవ్రంగా కృషి చేశాను. దాని ఫలితమే ఇప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్న పాటలు. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిత్రంలోని పాటలు నా కెరీర్‌కే చాలెంజ్ విసిరాయి.
ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే ‘రంగస్థలం’ కోసం నేను పాటలు రాయలేదు. సుకుమార్ గారు సందర్భాలు చెబుతుంటే, నేను మాటలను పలికిస్తే అవే పాటలైపోయాయి. నేను వాటిని పేపర్‌పైన పాటల రూపంలో రాసుకోలేదు. లిరికల్ షీట్ విడుదల చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే రాశాను. నా 27 సంవత్సరాల కెరీర్లో ఎప్పుడూ ఇలా జరగలేదు. అమెరికా నుంచి కొందరు పరిచయం యువత ఫోన్లు చేసి పుష్ప పాటలలోని పల్లవులు, చరణాలు పాడి వినిపిస్తుంటే ఈ కాలం యువత కూడా ఈ పాటల్లోని సాహిత్యాన్ని ఇంతలా ఓన్ చేసుకున్నారా అని చెప్పలేని సంతోషం కలిగింది.
ఇందులోని పుష్పరాజ్ (అర్జున్) పాత్ర యొక్క కోణంలో.. అతని పార్శ్వంలో.. అతని కవితాత్మక హృదయంతో చెప్పాల్సి రావటం నాకు నిజమైన ఛాలెంజ్ అనిపించింది. అందుకే ”వెలుగును తింటది ఆకు.. ఆకును తింటది మేక.. మేకను తింటది పులి.. పులిని తింటది చావు” పాటలో ఒక ఆహార గొలుసును తీసుకుని, దానికి జీవిత సత్యాన్ని జోడించి చెప్పాను. ఈ ఎత్తుగడే చాలా కొత్తగా అనిపిస్తోందని నాతో చాలా మంది అన్నారు. ఇలా ప్రతి పాటకూ ఎంతో మేధోమథనం జరిగింది. మొత్తానికి మా పుష్పలోని పాటలు ప్రేక్షకుల హృదయాలను గంప గుత్తగా దోచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital