తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవ్వాల (మంగళవారం) రాత్రి గరుడ వాహన సేవా వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి గరుడునిపై తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనోత్సవం అత్యంత ముఖ్యమైనదిగా చెబుతారు.
గరుత్మంతుడు వేదస్వరూపుడిగా, గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని పండితులు చెబుతారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకమని, అందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత ఉంటుందని వేద పండితులు అంటున్నారు.
గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారని, అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని వివరించారు. వాహనసేవలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు గరుడ వాహనంపై నుంచి మలయప్పస్వామి దర్శించుకున్నారు.