హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయన్న వాతావరణ శాఖ అధికారుల సమాచారాన్ని ఆసరాగా తీసుకుని నకిలీ విత్తన విక్రయదారులు రెచ్చి పోతున్నారు. తొలకరి వర్షం కురిసిన వెంటనే పొలాల్లో నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్న రైతులు నకిలీ విత్తన విక్రయదారుల చెరలో పడి అన్యాయానికి గురవుతున్నారు. నకిలీ విత్తనాలను విక్రయించినట్టు తేలితే అందుకు బాధ్యులైన వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరించినా ప్రయోజనం లేకుండా పోతోంది. కర్నాటక, మహారాష్ట్రతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున నకిలీ విత్తనాలు రాష్ట్రానికి తీసుకువచ్చి విక్రయించేందుకు అక్రమార్కులు సిద్ధమయ్యారన్న సమాచారం అందడంతో విజిలెన్స్, పోలీసులు పెద్ద ఎత్తున నిఘా పెట్టి నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లాలో మంగళవారం రూ.15 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు దాడులు పట్టుకున్నారు. ఈ విత్తనాలు పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్రం నుంచి తీసుకువచ్చి రైతులకు అందజేసేందుకు ప్రణాళిక రూపొందించినట్టు విచారణలో బయటపడింది.
మెరుపు దాడులు.. రెండు కోట్ల విలువైన నకిలీ విత్తనాల స్వాధీనం
గత నెల రోజుల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి రూ.2 కోట్లకుపైగా విలువైన పత్తి, మిరపతో పాటు ఇతర వాణిజ్య పంటలకు సంబంధించిన నకిలీ విత్తనాలను పట్టుకుని బాధ్యులైన వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించారు. వ్యవసాయ శాఖలోని నిఘా విభాగం అధికారులు నిద్రావస్తలో జోగుతుండడంతో నకిలీ విత్తన విక్రయదారులు ఇదే అదునుగా భావించి రైతులను దగా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది నకిలీ విత్తనదారులతో వ్యవసాయ శాఖలోని కొంత మంది అధికారులు చేతులు కలపడంతో ఈ వ్యాపారం యదేచ్చగా సాగుతోందన్న విమర్శలున్నాయి. నకిలీ విత్తన ఉత్పత్తిదారులు అధికారులకు ముడుపులు చెల్లిస్తుండడంతో వారు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని దీంతో పెద్ద ఎత్తున విత్తనాలు రాష్ట్రానికి వస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.
హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లా కీసర, దాయరా, ఘట్‌కేసర్, కొండాపూర్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, నారాయణపేట, అలంపూర్, కొల్లాపూర్, నారాయణపేట, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వైరా, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, మహబూబాబాద్ ప్రాంతాల నుంచి పత్తి, మిరప, సోయా, పొద్దు తిరుగుడు, టమాటతో సహా వివిధ పంటలకు సంబంధించిన నకిలీ విత్తనాలను తీసుకువచ్చి అమాయక రైతులకు కట్టబెడుతున్నట్టు తెలుస్తోంది. కర్నాటకలోని రాయచూర్, గుల్బర్గా, మహారాష్ట్రలోని నాందేడ్, నాగ్‌పూర్, చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, బిలాస్‌పూర్, బెంగళూర్, బీదర్, ఏపీలోని కర్నూల్, అనంతపురం, ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి తెలంగాణలోకి నకిలీ విత్తనాలు పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నట్టు నిఘా విభాగం అనుమానిస్తోంది. దీంతో సరిహద్దు జిల్లాల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి అన్ని రకాల వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన అక్రమార్కులు ఇతర మార్గాల ద్వారా విత్తనాలను రవాణా చేస్తూ తెలంగాణలోకి వస్తున్నారని సమాచారం అందడంతో ఆయా మార్గాల్లోనూ పోలీసులు నిఘాను తీవ్రతరం చేసి అడపాదడపా నకిలీరాయుళ్లను పట్టుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది.