ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది శ్రీలంక. దాంతో అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు నిరసనకారులు. అనంతరం ఆ భవనం అంతటా కలియతిరిగారు నిరసనకారులు. దేశాన్ని సంక్షోభం పాలు చేయడంపై వేలాది మంది ప్రజలు నిరసనలు, ఆందోళనలకు దిగడం తెలిసిందే. ఇంకా వారు ఆ భవనాన్ని విడిచి వెళ్లలేదు. మరోవైపు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో తప్పించుకుపోయిన అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ఆచూకీ లభించలేదు. ఆయన ఓడలో పారిపోయి ఉంటారన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి సంక్షోభం నేపథ్యంలో పెద్ద ఎత్తున నగదు అధ్యక్షుడి నివాసంలో గుర్తించారు. నగదును లెక్కిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. నిరసనకారులు అధ్యక్ష భవనంలోని స్విమ్మింగ్ పూల్ లో ఈతకొడుతూ, వ్యాయామ కేంద్రంలో కసరత్తులతో సందడి చేశారు. మిలియన్ల కొద్దీ కరెన్సీ నోట్లను గుర్తించినట్టు స్థానిక మీడియా పేర్కొంది. స్వాధీనం చేసుకున్న 17.8 మిలియన్ల నోట్లను సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించినట్టు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు తర్వాతే తాము వాస్తవాలను తెలుసుకోగలమని పోలీసులు ప్రకటించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement