Tuesday, November 12, 2024

Followup: రాత్రంతా రైల్వే స్టేషన్‌లోనే ఆందోళనకారులు, వ్యూహాత్మకంగానే దాడి!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో పసిగట్టి పట్టుకునే సాంకేతికతను కలిగి ఉన్న రాష్ట్ర నిఘా వ్యవస్థ నిద్రావస్థలో ఉందా….? లేక కావాలని చేతలుడిగి చూస్తుండి పోయిందా…? ప్రస్తుతం కేంద్ర నిఘా వర్గాలు, రాష్ట్ర ఇంటెలీజెన్స్‌ పనితీరుపై జోరుగా చర్చ జరుగుతోంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం జరిగిన ఘటన అప్పటికప్పుడు ఏదో కొంత మంది మూకగా ఏర్పడి చేసింది కాదు. ఒక పథకం ప్రకారం, ముందస్తుగా ఒకరికి ఒకరు సమాచారాన్ని చేర వేసుకుని కలిసికట్టుగా కాకుండా విడివిడిగా వచ్చి మూకుమ్మడిగా జరిపిన దాడి. కేంద్రం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్‌ పథకంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు తలెత్తుతున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాల్సిన నిఘా వ్యవస్థ ఎందుకు నిర్వీర్యంగా ఉందన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఆర్మీ ఉద్యోగాల కోసం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం గడచిన రెండు మూడేళ్ళుగా నిరుద్యోగ యువత అలుపెరగకుండా చదువుతున్నారు. పోటీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించినా జాబ్‌ కొట్టేయ్యాలన్న కసితో ఉన్నారు. అలాంటి వారంతా ఏకమై ఉద్యోగం సాధించాలన్న కసిని రైల్వే ఆస్తుల ధ్వంసంపై ప్రయోగించేందుకు సిద్దమవుతున్నారన్న విషయాన్ని నిఘా వర్గాలు గుర్తించడంలో ఘోరంగా వైఫల్యం చెందాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వేల మంది యువకులు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు క్యూకట్టడం, వారంతా పెట్రోల్‌ సీసాలు, ఇనుపరాడ్లు, కర్రలతో స్టేషన్‌లోకి వచ్చి దాడికి సన్నద్దమవుతున్నారన్న విషయం కూడా గుర్తించలేదంటే నిఘా శాఖ పనితీరు ఎలా ఉందో స్పష్టమవుతోంది.

సికింద్రాబాద్‌ స్టేషన్‌ పరిసర ప్రాంతాలు నిత్యం నిఘా నీడలో ఉంటుంది. స్టేషన్‌ పరిసర ప్రాంతాలలో ప్రయాణికులతో పాటు అసాంఘిక శక్తులు కూడా తిరుగుతాయన్న అనుమానంతో అడుగడుగునా నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే సికింద్రాబాద్‌ స్టేషన్‌ శత్రుదుర్బేధ్యంగా ఉంటుంది. అలాంటి దుర్బేధ్యాన్ని ఛేదించుకుని వేలాది మంది యువకులు రైల్వే స్టేషన్‌లో ఆస్తులను ధ్వంసం చేసేంత వరకూ గుర్తించ లేదంటే ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరించేలా ఉంది. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు నిరుద్యోగులు సన్నద్దమవుతున్నారని, ఉద్యమం కోసం ప్రత్యేకంగా కొన్ని వాట్సప్‌ గ్రూప్‌లు క్రియేట్‌ చేశారని, వాట్సప్‌ గ్రూపులలో సికింద్రాబాద్‌ స్టేషన్‌పై దాడికి వ్యూహాలను సన్నద్దం చేస్తున్నారని, ఆందోళనాకారులంతా సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వస్తున్నారన్న విషయాన్ని కూడా పసిగట్టలేకపోయారు.

రైల్వే ఆస్తులు, పరిసర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాల్సిన రైల్వే పోలీసులు, ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది కూడా ఆందోళనకారులను గుర్తించడంలో ఘోరంగా విఫలమయ్యారు. స్టేషన్‌లో దాడులకు తెగబడ్డ అనంతరం కొంత మంది యువకులు మీడియాతో మాట్లాడుతూ, తామంతా గడచిన రెండు రోజులుగా వాట్సప్‌ గ్రూప్‌లలో ఛాటింగ్‌ చేసుకున్నామని, నిర్ణీత సమయంలో స్టేష|న్‌కు చేరుకుని దాడికి దిగాలని నిర్ణయించుకున్నామని, ఇందుకోసం కొంత మంది గురువారం రాత్రే సికింద్రాబాద్‌ స్టేషన్‌ లోపలికి వచ్చారని చెప్పారు. వచ్చిన వారెంత మంది, వారంతా ఏం చేస్తున్నారన్న విషయాలను జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ పోలీసులతో పాటు రైల్వే నిఘా విభాగం కూడా పసిగట్టడంలో వైఫల్యమైంది.

హైదరాబాద్‌ నగరంతో పాటు శివారు ప్రాంతాలు నిత్యం నిఘా నీడలో ఉంటాయి. నగరంలో ఏ మూలన ఏ చిన్న ఘటన జరిగినా క్షణాల్లో పసిగట్టే సాంకేతికతను మన పోలీసులు సమకూర్చుకున్నారు. నగరంలో దాదాపు రెండున్నర లక్షల సీసీ కెమెరాలున్నాయి. ఇంతటి వ్యవస్థ కలిగి ఉన్న మన పోలీసులు వేల సంఖ్యలో తరలివచ్చిన ఆందోళనకారులను ఏ మాత్రం పసిగట్టలేదంటే ఆశ్చర్యమనిపిస్తోంది. ఒక చైన్‌ స్నాచింగ్‌ చేసి పారిపోతున్న నిందితుడిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించే సామర్థ్యం కలిగిన మన పోలీసులు వేల మంది ఆందోళనకారులు పెట్రోల్‌ సీసాలు, ఇనుపరాడ్లు, కర్రలతో సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వస్తుంటే ఎందుకు గుర్తించలేదన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

జవాబులేని ప్రశ్నలెన్నో….
స్టేషన్‌లోకి చొరబడి దాడికి పాల్పడ్డ యువకులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వీరికి నాయకత్వం వహించారు, వీరికి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి సమకూరాయి, హింసాత్మక ఘటనల వెనక వ్యూహం ఎవరిది అన్న విషయాలను ఇప్పటికీ నిఘా వర్గాలు తెలుసుకోలేకపోతున్నాయి. దాడికి కారణం అగ్నిపథ్‌ అని ఆందోళనకారులు బహిరంగంగా ప్రకటించారు. అయితే అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఉద్యమించాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది. వాట్సప్‌ గ్రూపులు క్రియేట్‌ చేసింది ఎవరు, నిరుద్యోగులను గుర్తించి వారి ఫోన్‌ నంబర్లను సేకరించి అప్పటికప్పుడు వాట్సప్‌ గ్రూపులలో చేర్చింది ఎవరన్న అనేక విషయాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. నిరుద్యోగుల ఆందోళనకు అవసరమైన ఆర్థిక వనరులు, పెట్రోల్‌ కొనుగోలు, కర్రలు, ఇనుప రాడ్లను ఎవరు సమకూర్చారనేది కూడా ఇప్పటికీ జవాబు లేని ప్రశ్నలుగానే మిగిలాయి.

సాధారణ ఆస్తుల ధ్వంసం కేసులు, రైల్వే ఆస్తుల ధ్వంసం కేసుకు చాలా వ్యత్యాసం ఉంది. రైల్వే ఆస్తులపై దాడికి పాల్పడితే కఠిన శిక్షలు, జరిమానాలుంటాయి. అలా అని తెలిసినప్పటికీ ఆందోళనకారులు తెగించి ముందుకు వచ్చారంటే కారణాలు బలంగా ఉంటాయి. అంతేకాకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఆదోళనకారులు ముందుగా రైల్వే పార్సిల్‌ కార్యాలయంలోకి చొరబడి అందులోని లగేజీని కొన్ని వాహనాలను పట్టాలపై వేసి నిప్పంటించారు. అంతేకాకుండా ఆందోళనకారులు ముందుగానే స్టేషన్‌లోని సిగ్నలింగ్‌ వ్యవస్థను ధ్వంసం చేయడంతో పాటు అనౌన్స్‌మెంట్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారు.

అంతా ప్రణాళికా ప్రకారం జరిగిన ఆందోళన వెనుక బలమైన శక్తులున్నాయన్న విషయం స్పష్టమవుతోంది. ఈ శక్తులు ఎవరనేది కూడా నిఘా వర్గాలు గుర్తించలేకపోయాయి. ఏది ఏమైనా విధ్వంసకాండ వెనుక బలమైన శక్తులున్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నప్పటికీ ఎవరనేది చూచాయగా కూడా గుర్తించక పోవడం నిఘావర్గాల పనితీరుకు అద్దం పడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement