Friday, November 22, 2024

ఏపీ భవన్ విభజనకు ముందడుగు.. అధికారులతో త్వరలో కమిటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వెలుపల ఉన్న ఉమ్మడి ఆస్తుల పంపకాల కోసం అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్టు తెలిసింది. బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో సూచించిన మేరకు రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, సంస్థల విభజన జరగాల్సి ఉండగా, కొన్నింటి విషయంలో ఏమాత్రం పురోగతి లేకపోయింది. విభజన జరిగి 8 ఏళ్లు పూర్తికావొస్తున్న తరుణంలో.. పంపకాల వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో బుధవారం జరిగిన సమావేశంలో ఉమ్మడి ఆస్తుల పంపకాలపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన గురించి అధికారులు చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ భవన్‌గా ప్రసిద్ధి చెందిన ఉమ్మడి భవన్ విభజన కోసం అధికారులు ఇప్పటికే కసరత్తు చేసినప్పటికీ కొలిక్కి రాలేదు. రెండు రాష్ట్రాల వాదనలు పరస్పరం భిన్నంగా ఉండడంతో మందుకు సాగలేదు. అయితే ఇప్పుడు విభజనపై ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదించినట్టు తెలిసింది. రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్ర హోంశాఖ అంగీకరించడంతో పాటు, గడువు పెట్టుకుని మరీ పనులు పూర్తిచేయాలని సూచించింది.

- Advertisement -

ఏపీ భవన్ సహా ఉమ్మడి ఆస్తులపై అధ్యయనం చేసి సమగ్ర వివరాలు, ప్రతిపాదనలతో కూడిన నివేదికను తయారుచేయాలని హోంశాఖ ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ పరిపాలనా కేంద్రం సెంట్రల్ విస్టాకు ఆనుకుని దాదాపు 20 ఎకరాల సువిశాల ఆంధ్రప్రదేశ్ భవన్ స్థలాన్ని విభజన చట్టంలో పొందుపర్చిన ఫార్ములా ప్రకారం 58:42 నిష్పత్తిలో తెలుగు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంటుంది. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసే కమిటీ ఈ ఫార్ములా ప్రకారం పంపకాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement