తెలంగాణ రాష్ట్రంతోపాటు పొరుగున ఉన్న కర్ణాటక, ఏపీ, చత్తీస్‌గడ్ రాష్ట్రాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ పెద్దాసుపత్రిగా పేరొందిన హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారింది. రోగుల వ్యాధులను నయం చేయాల్సిన ఈ పెద్దాసుపత్రికే వైద్యం అందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 100 ఏళ్లకు పైబడిన చరిత్ర, పేదలకు వైద్యం అందించడంలో పేరున్న వైద్యులు ఉండడంతో ఉస్మానియాలో చికిత్స చేయించుకునేందుకు పేదలు ఇక్కడికి వస్తుంటారు. రోజు రోజుకూ ఓపీ వైద్యం కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది, దాంతోపాటు ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్ అడ్మిషన్లు కూడా పెరుగుతున్నాయి. అయితే పేషెంట్ల పెరుగుదలకు సరిపడా స్తాయిలో ఆసుపత్రిలో సౌకర్యాలు కరువయ్యాయి.
కొన్ని నెలలుగా ఉస్మానియా ఆసుపత్రి పాత భవనాన్ని మూసివేయడంతో పడకల సామర్థ్యం బాగా తగ్గిపోయింది. పాత భవనాన్ని మూసివేయడం, కొత్త భవనం నిర్మించే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో రోగులకు వైద్యం ఎలా అందించాలో వైద్యులకు పాలుపోని వింత పరిస్థితి ఉస్మానియా ఆసుపత్రిలో రాజ్యమేలుతోంది. చివరకు విధులు నిర్వహిస్తోన్న వైద్యులపై ఫ్యాన్ ఊడిపడిన ఘటన కూడా ఇటీవలే చోటు చేసుకుంది. ఈ పరిస్థితిల్లో ఆసుపత్రిలో భయం భయంగా విధులు నిర్వహించాల్సి వస్తోందని జూనియర్ డాక్టర్లు, వైద్యులు, సిబ్బంది వాపోతున్నారు.
బెడ్లు దొరక్క, దొరికినా చెట్ల కిందనో, కిటికీల పక్కనో, వరండాలోనో చికిత్స పొందాల్సిన దీనస్థితి ఉస్మానియాలో నెలకొంది. చినుకు పడితే నదీ ప్రవాహాన్ని తలపిస్తుందని రోగులు, వారి సహాయకులు, ఆసుపత్రి సిబ్బంది వాపోతున్నారు. ఆసుపత్రిలో పారిశుధ్యం లోపించింది. ఆసుపత్రి ప్రాంగణాలు ఎటుచూసినా దుర్ఘంధంతో నిండిపోతున్నాయని చెబుతున్నారు. ఓ వైపు కరోనా వైరస్, మరో వైపు సీజనల్ వ్యాధులు, చలికాలం ఫ్లూ వ్యాధులు పంజా విసురుతున్నా ఆసుపత్రిలో చాలా వైద్య ఉపకరణాలు, డయాగ్నస్టిక్ మిషన్లు పనిచెయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతు న్నాయి.
ఉస్మానియా ఆసుపత్రి సమస్యల ఊబిలో కూరుకుపోయిన ఈ సమయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించనున్నారు. మంత్రి హరీష్‌రావు చొరవతొనైనా ఆసుపత్రి భవన నిర్మాణ అంశం కొలిక్కి వస్తుందని అటు రోగులు, ఇటు సిబ్బంది గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు. ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రిని వేడుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital