ఓ మహిళ ప్రైవేట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 33 ఏళ్ల వ్యక్తిని ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన రాజేష్‌సింగ్ సుమన్‌గా గుర్తించారు. సుమన్ తనను వెంబడిస్తూ.. బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళ ఢిల్లీలోని ద్వారకా సౌత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనకు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా అతను పరిచయం అయ్యాడని, రెండు సార్లు తనను కలిసినట్టు ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది. అయితే ఆ తర్వాత అతనితో తన ప్రైవేట్ ఫొటోలను కూడా షేర్ చేసుకుందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కానీ, వారిద్దరికీ పెళ్లి జరగలేదన్నారు. ఆ తర్వాత నిందితుడు ఆ మహిలను ఫొటోలు చూపుతూ బ్లాక్ మెయిల్ చేయడం, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతోపాటు తనకు తెలిసిన వారికి ఫొటోలను సెండ్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డట్టు ఆ మహిళ కంప్లెయింట్ చేసిందన్నారు.
అంతేకాకుండా ఆ వ్యక్తి నకిలీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ఓపెన్ చేసి వాటి ద్వారా తన ప్రైవేట్ ఫొటోలను పోస్ట్ చేస్తున్నాడని ఆ మహిళ ఆరోపించిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అలీఘర్‌లో అరెస్టు చేశామని, అతని ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ద్వారక) శంకర్ చౌదరి తెలిపారు. ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఇలాంటి కేసులో సుమన్‌ను ఇంతకుముందు కూడా అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. తాను వేర్వేరు మహిళలతో ఇట్లాంటి నేరాలకు పాల్పడినట్లు సుమన్ అంగీకరించాడని, అతని మొబైల్ ఫోన్ డేటాను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.