నేడు తెల్లవారు జామున ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. కాగా ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. మాతృమూర్తి చితికి మోడీ నిప్పంటించారు. చివరిసారిగా చేతులు జోడించి అంతిమ నివాళులర్పించారు. సోదరుడు, కుటుంబ సభ్యులతో కలిసి తన తల్లికి వీడ్కోలు పలికారు. అంతిమ యాత్రంలో భాగంగా మోడీ తన మాతృమూర్తి పాడె మోశారు. వాహనంలో అమ్మ పక్కనే కూర్చున్నారు. గాంధీనగర్‌లోని సెక్టార్ 30 స్మశాన వాటిలో జరిగిన అంతిమక్రియల్లో మోడీ కుటుంబ సభ్యులతోపాటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.. హీరాబెన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
దీంతో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచిచారు. ఇటీవలే వందో పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. హీరాబెన్ మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, రాష్ట్ర గవర్నర్ తమిళిసై, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు,సీఎంజగన్, టిడిపి అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు.