చండీగడ్ : పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతాపరమైన లోపం విషయమై.. ఇప్పటికీ.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరికొన్ని రోజుల్లో పంజాబ్‌లో అసెంబ్లిd ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఈ అంశంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ప్రధాని మోడీపై భౌతికంగా దాడి చేసేందుకు కాంగ్రెస్ పన్నాగం పన్నిందని బీజేపీ నేతలు విమర్శించారు. బీజేపీ నేతలది.. ఇది పొలిటికల్ డ్రామా అంటూ కాంగ్రెస్ నేతలు కొట్టి పారేస్తున్నారు. ప్రధాని మోడీ వచ్చే సమయానికి.. వేదిక వద్ద ప్రజలు ఎవరూ లేకపోవడంతోనే.. ఉద్దేశ పూర్వకంగా ఈ పరిస్థితి సృష్టించారని విమర్శించారు. కావాలనే.. సభను రద్దు చేసి.. భద్రతలో లోపం ఉందంటూ ఎత్తి చూపుతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
మోడీ పర్యటనలో భద్రతాపరమైన లోపాలు ఎక్కడా లేవని పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ చెప్పుకొచ్చారు. పీఎం మోడీకి భారీ భద్రత ఏర్పాటు చేసినట్టు వివరించారు. ప్రారంభోత్సవానికి, పొలికల్ ర్యాలీలో పాల్గొనేందుకు మోడీ పంజాబ్ వచ్చారని, రూట్ బ్లాక్ కావడంతో వెనుదిరిగి వెళ్లిపోయారన్నారు. దేశానికి ప్రధాని కావడంతో తాము ఆయన్ను గౌరవిస్తామని, ఇది ప్రజాస్వామ్యయుత దేశమని చెప్పుకొచ్చారు. కావాలనే మోడీని అడ్డుకున్నారని, 20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్‌పై వేచి ఉండేలా చేశారంటూ హోంశాఖ మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. వెంటనే దీనిపై నివేదిక ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు. ఆ నాటి నుంచి పంజాబ్ ఎన్నికల విషయం చర్చకు వచ్చినప్పుడల్లా.. మోడీకి భద్రత అంశాన్ని అమిత్ షా తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికీ ఇరు పార్టీల మధ్య వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.