భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లున్నారు. సెప్టెంబర్ నెలాఖారులో ప్రధాని అమెరికా పర్యటన ఉంటుందని సమాచారం. వాషింగ్టన్, న్యూయార్క్ లకు వెళ్లి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను మోదీ కలవనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికైన తర్వాత మోదీ తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. సెప్టెంబర్ 22 నుంచి 27తేదీల మధ్యలో మోదీ అమెరికా పర్యటన ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అఫ్ఘానిస్తాన్ తలిబన్ల వశమైన నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. అఫ్ఘానిస్తాన్ లో నెలకొన్న పరిస్థితులపైన కూడా మోదీ చర్చించనున్నట్లు తెలుస్తుంది. గతంలో అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్ తో మోదీ మూడు సార్లు వర్చువల్ మీటింగ్ లలోనూ పాల్గొన్నారు. జీ7 సదస్సులో భాగంగా యూకేకు వెళ్లి బైడెన్ ను మోదీ కలుస్తారని అంతా భావించారు. అయితే, అనివార్య కారణాలతో ప్రధాని పర్యటన రద్దు అయింది. అయితే, ఈ సారి ప్రత్యేకంగా బైడెన్ ను మోదీ సమావేశం కాబోతున్నారు.