Friday, November 15, 2024

రేపు తెలంగాణకు రానున్న ప్రధాని మోడీ.. టూర్ షెడ్యూల్ ఇదే..

ప్రధాని నరేంద్ర మోడీ రేపు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న రామానుజచార్యుల సహస్రాబ్ది సమారోహంలో పాల్గొననున్నారు. అంతేకాకుండా సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిసాట్‌ స్వర్ణోత్సవాలకు హాజరవుతారు. మొత్తంగా ప్రధాని తెలంగాణ టూర్ ని పరిశీలిస్తే..  రేపు (5వ తేదీ) మధ్యాహ్నం 2.10 గంట‌ల‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో పఠాన్‌చెరులోని ఇక్రిశాట్ క్యాంపస్‌కు వెళ్తారు. ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకలను మోడీ ప్రారంభిస్తారు. మొక్కల సంరక్షణకు సంబంధించి ఇక్రిశాట్ వారి వాతావరణ మార్పు పరిశోధనా సదుపాయం, రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్ మెంట్ ఫెసిలిటీని ప్రధాని  ప్రారంభిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన ఇక్రిశాట్ లోగోను ఆవిష్కరిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ స్టాంప్‌ను కూడా విడుదల చేయనున్నారు మోడీ.

ఆ తర్వాత ముచ్చింతల్ కు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలు దేరి వస్తారు ప్రధాని మోడీ. దాదాపు 5 గంటల ప్రాంతంలో ఆయన ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. యాగశాలలో సాయంత్రం 6 గంటలకు పెరుమాళ్లను దర్శించుకొని విశ్వక్ సేనుడికి పూజ చేస్తారు. అనంతరం సమతామూర్తి కేంద్రానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.

216 అడుగుల ఎత్తైన సమతామూర్తి విగ్రహానికి మోడీ.. చినజీయర్​ స్వామితో కలిసి పూజ చేస్తారు. తర్వాత సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితమివ్వనున్నారు. అనంతరం అక్కడి నుంచే యావత్ ప్రపంచానికి మోడీ తన సందేశాన్ని ఇవ్వనున్నారు. మోడీ సమక్షంలోనే రామానుజచార్యుల విగ్రహంపై 15 నిమిషాలపాటు 3డీ లైటింగ్ ప్రదర్శిస్తారు. ఆ తర్వాత ముచ్చింతల్‌ ఆశ్రమం నుంచి ప్రధాని మోడీ రోడ్డు మార్గంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు.

పటిష్ట బందోబస్తు..

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా  పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో 7వేల మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టారు. ఇక్రిశాట్, ముచ్చింతల్‌ ఆశ్రమాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని భద్రతా ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర పోలీసులతో ఎస్పీజీ అధికారులు సమన్వయం చేస్తున్నారు. ముచ్చింతల్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. శ్రీరామనగరంలో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement