ఇండియాతో పాటు ప్రపంచమంతా కరోనా సమస్యను ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. గత శతాబ్ధ కాలంలో ఇదే అతిపెద్ద విషాదమని పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఎంతోమంది ఆప్తులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్‌పై పోరాటంలో కోవిడ్ ప్రోటోకాల్, వ్యాక్సిన్ మనకు రక్షగా నిలుస్తున్నాయని తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ప్రపంచంలో ఏ దేశం కంటే భారత్ వెనుకబడి లేదని ప్రధాని స్పష్టం చేశారు. మన శాస్త్రవేత్తలు తక్కువ సమయంలో ఎంతో కష్టపడి వ్యాక్సిన్ తయారుచేశారని మోదీ ప్రశంసించారు. రానున్న కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. త్వరలోనే చిన్నారుల కోసం కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇప్పటివరకు 23 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశామని మోదీ వెల్లడించారు.
దేశంలో 7 కంపెనీలు వ్యాక్సిన్లు తయారుచేస్తున్నాయని, మూడు కంపెనీల వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని మోదీ తెలిపారు. వ్యాక్సిన్ ప్రక్రియ కోసం ఏ రాష్ట్రం కూడా రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వమే కరోనా టీకాలను కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుందని మోదీ వెల్లడించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కేంద్రమే ఉచితంగా టీకా ఇస్తుందన్నారు. టీకాల్లో 25 శాతం ప్రైవేట్ రంగానికి అందుబాటులో ఉంచుతామని, సొంత ఖర్చుతో వ్యాక్సిన్ వేయించుకోవాలని భావించేవారు ప్రైవేట్ రంగాన్ని ఆశ్రయించవచ్చని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రులు రూ.150 మాత్రమే సర్వీస్ చార్జి తీసుకోవాలని స్పష్టం చేశారు
దీపావళి వరకు ఉచితంగా రేషన్
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని దీపావళి వరకు పొడిగించినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ పథకం కింద మే, జూన్ నెలల్లో మాత్రమే దేశంలో దాదాపు 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ, ఇప్పుడు దాన్ని ఈ ఏడాది దీపావళి వరకు పొడిగించడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా ఈ ఏడాది నవంబరు వరకు దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందుతుంది. గత ఏడాది కూడా కోవిడ్ సమయంలో కొన్ని నెలల పాటు ఈ స్కీమ్‌ను కేంద్రం అమలు చేసింది