ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వాల ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసిని సందర్శించారు. గంగానదిని, కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని కలుపుతూ నిర్మించిన కారిడార్‌ను ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. తొలుగ గంగానదిలో స్నానమాచరించి, కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా, దివ్యకాశి, భవ్య కాశి ప్రాజెక్టు కోసం రూ.339 కోట్లు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం. మోడీ సొంత పార్లమెంట్ నియోజకవర్గం కావడంతో ఆయన ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపారు. పనులను ఎప్పటికప్పుడు సమీక్షించి.. ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు.
దేశంలోని పవిత్ర పుణ్య క్షేత్రాల్లో కాశీ విశ్వేశ్వరుడి ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆలయ సుందరీకరణ పనులు, కారిడార్ ప్రారంభోత్సవం కోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. దీంతో వారణాసిలో పండుగ వాతావరణం నెలకొంది. 55 అత్యాధునిక కెమెరాలు, భారీ డ్రోన్లతో ప్రాజెక్ట్ అందాలను చిత్రీకరిచనున్నారు. ఈ దృశ్యాలను దేశ ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
‘దివ్యకాశీ-భవ్య కాశీ’ పేరుతో నెలపాటు సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేశంలోని ప్రధాన శివాలయాల అన్నింటిలో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేసి.. కార్యక్రమాన్ని చూసేలా ఏర్పాట్లు చేయనున్నారు. కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మత పెద్దలు, సాధువులు తరలి వచ్చారు.
2019లో శంకుస్థాపన..
కాశీ విశ్వనాథ్ కారిడార్ అభివృద్ధి పనులకు 2019 మార్చిలో శంకుస్థాపన చేశారు ప్రధాని మోడీ. ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన సమయం నుంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వచ్చారు. దేశంలో ఆకర్షణీయమైన పుణ్య క్షేత్రంగా దీనిని తీర్చిదిదేలా చొరవ తీసుకున్నారు.