రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్న ఆయన పేరును ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించగా మిగిలిన విపక్ష పార్టీలు ఏకగ్రీవ మద్దతు ప్రకటించాయి. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ సారథ్యంలో మంగళవారం భేటీ అయిన ఎన్‌సీపీ, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, సమాజ్‌వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఏఐఎంఐఎం, ఆర్‌జేడీ, ఏఐయుడీఎఫ్ పార్టీల పార్లమెంటరీ పక్షాలు, ఇతర కీలక నేతలు విస్తృతంగా చర్చించి యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేశాయి. సమావేశం అనంతరం విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ప్రకటించారు.
ఈ మేరకు ఉమ్మడి ప్రకటనను ఆయన చదివి వివరాలు వెల్లడించారు. అన్ని ప్రగతిశీల పార్టీల ఏకగ్రీవ మద్దతుతో అభ్యర్థిగా ఎంపికైన యశ్వంత్ సిన్హాను అభినందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి పదవికి తగిన వ్యక్తి అని, అపార అనుభవం, చతురత ఉన్న నేత అని కొనియాడారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి అధికార బీజేపీ, ఎన్డీయే సహా అన్ని పక్షాలు మద్దతు ఇవ్వాలని జైరామ్ రమేష్ కోరారు. దేశ అత్యున్నత పద విని ఏకగ్రీవంగా ఎన్నుకునే విషయంలో భారతీయ జనతా పార్టీ అనాసక్తిని ప్రదర్శిస్తోందంటూ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఎన్నికలకు జూన్ 29వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జులై 18న ఎన్నిక నిర్వహిస్తారు.
కాగా ఈనెల 27న ఉదయం 11.30 గంటలకు యశ్వంత్ సిన్హా నామినేషన్ వేయనున్నారు. సిన్హా తరపున ప్రచారం చేసేందుకు, విజయం సాధించేలా కృషి చేసేందుకు ఒక కమిటీని విపక్షాలు ఏర్పాటు చేశాయి. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా విపక్షాలు కలసికట్టుగా వ్యవహరిస్తున్నాయని, రాబోయే కాలంలో మరింత ఐక్యంగా పనిచేయనున్నాయని జైరాం రమేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. నిజానికి, ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాల్సిందిగా ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ను విపక్షాల తొలి సమావేశంలో వచ్చిన ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. అనంతరం నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేర్లను తెరపైకి తీసుకురాగా వారు కూడా పోటీ చేయబోమని తేల్చి చెప్పారు. విపక్షాలకు అసలు అభ్యర్థే దొరకడం లేదని విమర్శలు వచ్చిన నేపథ్యంలో యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా ప్రకటించడం విశేషం.
ముందే సంకేతమిచ్చిన సిన్హా
తృణమూల్ నేత యశ్వంత్ సిన్హా మంగళవారం ఉదయాన్నే చేసిన ఓ ట్వీట్ సంచలనం రేపింది. ప్రత్యక్ష రాజకీయాలనుంచి ఇక తాను తప్పుకోక తప్పదని, విపక్షాల ఐక్యతకోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించిన ఆయన జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాను ఈ నిర్ణయం తీసుకోవలసి వస్తోందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తన నిర్ణయాన్ని మమత ఆమోదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ తరువాత విపక్షాల భేటీ, రాష్ట్రపతి పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక చకచకా జరిగిపోయాయి. అనం తరం ఆయన స్పందిస్తూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి తనకు ఇచ్చిన గౌరవం, తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు.