గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము. ఆమెకు గిరిజన సంప్రదాయంతో ఘన స్వాగతం లభించింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభలో ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైసీపీ ఎంపీలు మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, బాలశౌరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సీఎం రమేశ్, మాధవ్‌లు స్వాగతం పలికారు. ద్రౌపది ముర్ము వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వచ్చారు. స్వాగత సత్కారాల అనంతరం ద్రౌపది ముర్ము నేరుగా తాడేపల్లిలోని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి బయలుదేరనున్నారు.
సీఎం జగన్ నివాసంలో తేనీటి విందు అనంతరం ఆమె మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌కు వెళతారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో అక్కడ సమావేశమై రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఆమె వారిని కోరనున్నారు. ఈ సందర్భంగా ఆమె వెంట సీఎం జగన్ కూడా సీకే కన్వెన్షన్‌కు వెళ్లనున్నారు.ఈ సమావేశం ముగిసిన అనంతరం విజయవాడలోని గేట్‌వే కన్వెన్షన్ సెంటర్‌కు ద్రౌపది ముర్ము వెళతారు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ కానున్న ముర్ము ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ముకే మద్దతు ఇవ్వాలని సోమవారమే టీడీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె వైసీపీతో పాటు టీడీపీ ప్రజా ప్రతినిధులను కలవనున్నారు. టీడీపీతో భేటీ అనంతరం ముర్ము తిరిగి ఢిల్లీ బయలుదేరనున్నారు.