ఓ మహిళ..అందులోనూ నిండు గర్భిణి ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసు. అయితే ఆమె బేబిబంప్ తో సాహసం చేసింది. ఆరుగంటలు కర్రసాము విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటన తమిళనాడులోని అనైక్కడు గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన షీలాదాస్ ధైర్యసాహసాలకి అంతా అవాక్కయ్యారు. కాగా షీలాదాస్‌కు చిన్నతనం నుంచే ఆటలంటే మక్కువ. అందుకే కర్రసాము, బాక్సింగ్, కరాఠే.. వంటి విద్యలను నేర్చుకుంది. చదువుకుంటోన్న క్రమంలోనే వివిధ పోటీల్లో పాల్గొని బోలెడన్ని బహుమతులను సాధించింది. ఇక పెళ్లయ్యాకా తన భర్త ప్రోత్సాహంతో ఈ మార్షల్ ఆర్ట్స్‌ని కొనసాగించిందట. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన షీల.. ప్రజెంట్ ఎంతోమందికి శిక్షణ ఇస్తున్నారు.
గతంలో నిర్వహించిన ఓ వెయిట్ లిఫ్టింగ్ పోటీలో భాగంగా ‘ఐరన్ ఉమన్’ టైటిల్‌తో పాటు జాతీయ రికార్డునూ కైవశం చేసుకున్నారు. తొమ్మిది నెలల నిండు గర్భిణి అయిన షీల.. ఇటీవలే ‘అనైక్కడు సిలంబం అసోసియేషన్’ వారు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని… ఆరు గంటల పాటు విడవకుండా కర్రసాము విన్యాసాలు చేశారు. తొలుత మూడు గంటలు ఒక కర్రతో, మరో మూడు గంటలు రెండు కర్రలతో విన్యాసాలు ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె కర్రసాముకు ఫిదా అయిన ‘నోబెల్ వరల్డ్ రికార్డ్స్’ వారు ఆమెకు బహుమతితో పాటు సంబంధిత ధ్రువపత్రాన్ని అందించి గౌరవించారు.మానసికంగా దృఢంగా ఉండడం వల్ల ఇప్పుడీ రికార్డు సొంతమైందని… పోటీలో పాల్గొనడానికి ముందే నిపుణులతో సంబంధిత పరీక్షలన్నీ చేయించుకున్నట్లు.. వారి అంగీకారం మేరకే నిర్విరామంగా ఫీట్ పూర్తిచేయగలిగానని షీల పేర్కొంది. ముందు నుంచే.. ఈ యుద్ధకళల్లో ప్రావిణ్యం ఉంది కాబట్టి. షీల ఈ రికార్డును సొంతం చేసుకోగలిగింది. గర్భిణీలు కఠినమైన వ్యాయామాలు చేయడం అంత సాధ్యం కాదు. అలవాటు లేని పని ఆ టైంలో అస్సలు చేయకూడదు కూడా.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..