Thursday, November 21, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై వర్క్ ఫ్రం హోమ్!

దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో చెలరేగిపోతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి మహమ్మారి మరింతగా పంజా విసురుతోంది. ప్రతి రోజూ లక్షలాది కేసులు వెలుగుచూస్తుండగా, వేలాదిమంది దాని కబంధ హస్తాల్లో చిక్కుకుని ప్రాణాలు విడుస్తున్నారు. దేశవ్యాప్తం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా వీలు ఉన్న అన్ని శాఖల ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించింది. గర్భిణీ స్త్రీలు, వికలాంగ ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా కంటైన్‌మెంట్ జోన్‌లో నివసించే ఉద్యోగులు, అధికారులు కూడా ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతినిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే అధికారులు, ఉద్యోగులు కోవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని సూచించింది. మే 31 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొంది.

ఇప్పటికే కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న 50 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే బాధ్యతలు నిర్వర్తించేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 19న ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని మరింత విస్తరిస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలలో పనిచేసే గ్రూప్‌ బీ, గ్రూప్‌ సీ స్థాయి ఉద్యోగులకు వర్తిస్తాయి.

ఇదీ చదవండి: సంగం డెయిరీ కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

Advertisement

తాజా వార్తలు

Advertisement