Tuesday, November 19, 2024

Flash: పెద్ద ఆస్పత్రికి కరెంట్ కష్టాలు.. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీలకు పడిగాపులు

పేద రోగులకు జిల్లా స్థాయి ప్రభుత్వాస్పత్రులు పెద్దదిక్కు. వేలకు వేలు వెచ్చించి ప్రైవేటు వైద్యం చేయించుకోలేని వారు ఈ ఆస్పత్రినే నమ్ముకుంటున్నారు. నిత్యం వందలాది మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. గర్భిణీలకు ప్రభుత్వఆస్పత్రుల్లోనే ప్రసవం జరిగేలా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. అయినా క్షేత్రస్థాయిలో వారికి మెరుగైన వైద్యసేవలు అందడం లేదు. సిబ్బంది, పడకల కొరత, కరెటు కష్టాలు, లేకపోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి.

వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రిలో కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్లితే..జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల (మాత శిశు సంరక్షణ కేంద్రం) ఆసుపత్రికి కరెంట్ కష్టాలు తప్పడం లేదు. గత 15 రోజుల క్రితం ఆస్పత్రి ఆవరణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వేరే ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయలేక మరో చిన్న ట్రాన్స్ఫర్ తో కాలం వెళ్లదీస్తున్నారు. అది కాస్తా సోమవారం ఉదయం కాలిపోవడంతో ఆసుపత్రి చీకట్లో మగ్గుతుంది. ఆస్పత్రి ఆలనా పాలనా చూసే నాధుడు కరువవడంతో కరెంటు కష్టాలను పట్టించుకునే వారు లేరని వైద్యం కోసం వచ్చిన గర్భిణీలు బాలింతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

మాత శిశు సంరక్షణ కేంద్రంకు మంగళవారం ప్రసవం కోసం సుమారు ఆరుగురు గర్భిణీలు వచ్చారు. అయితే వారికి ఆపరేషన్ చేయాల్సి ఉండగా విద్యుత్ సమస్యతో వైద్యులు ఆపరేషన్ చేయలేకపోతున్న ట్లు తెలిసింది. దీంతో అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే ఆస్పత్రిలో సరైన చికిత్స అందక ఓ నిండు గర్భిణీ 108 వాహనంలో ప్రస్తావించిన విషయం విదితమే. అంతేకాకుండా విద్యుత్ లేకపోవడంతో ఆస్పత్రిలో ఉన్న బాలింతలు, నవజాత శిశువులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లా కేంద్రానికి పెద్దదిక్కుగా ఉన్న ఆసుపత్రిలో సరైన మౌలిక వసతులు కల్పించకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించాల్సిన బాధ్యతలు మారవడంతో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆస్పత్రికి 24 గంటలు విద్యుత్తు ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement