Friday, November 22, 2024

Union Minister | చిన్న రిఫైనరీలకు ప్రాధాన్యం.. కేంద్ర మంత్రి హర్దీప్​సింగ్​ పూరి

దేశంలో చిన్న రిఫైనరీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర చమురు శాఖ మంత్రి హరిదీప్‌సింగ్‌ పూరీ తెలిపారు. ఇండో-అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన ఎనర్జీ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. చిన్న రిఫైనరీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, ప్రధానంగా భూ సేకరణ సమస్య చాలా వరకు తగ్గుతుందన్నారు. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం, హిందూస్థాన్‌ పెట్రోలియం సంస్థలు ఏర్పాటు చేయనున్న 60 మిలియన్‌ మిట్రిక్‌ టన్నుల వార్షిక సామర్ధ్యంతో నిర్మించనున్న రిఫైనరీకి భూ సేకరణ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం మన దేశంలో సంవత్సరానికి 252 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల రిఫైనరీ సామర్ధ్యం ఉంది. దీన్ని 450 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెద్ద రిఫైనరీలకు ఎక్కువ భూ సేకరణ చేయాల్సి ఉంటుందని, దీనికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. వీటితో పాటు భారీగా పెట్టుబడులు కావాల్సిి వస్తోందన్నారు. 20 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల వార్షిక రిఫైనరీ సామర్ధ్యంతో ఎక్కువ రిఫైనరీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతానికి సంవత్సరానికి 300 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల రిఫైనరీ సామర్ధ్యాన్ని సాధించాలని భావిస్తున్నామని చెప్పారు. 450 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యానికి పెంచేందుకు మరిన్ని విధానపరమైన నిర్ణయాలు అవసరమవుతాయని చెప్పారు.

ఇండియా ఎనర్జీ హబ్‌గా మారుతుందని, దేశం గ్రీన్‌ఎనర్జీ వైపుగా పయనిస్తోందన్నారు. పెట్రోకెమికల్స్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే రిఫైనరీలు మనకు అవసరం ఉన్నాయని మంత్రి హరిదీప్‌ సింగ్‌ పూరీ చెప్పారు. సంప్రదాయ ఇంధనాల్లో బయో ఇంధనాలను బ్లండ్‌ చేయడం పెరగాల్సి ఉందని మంత్రి చెప్పారు. 2030 నాటకి 500 గిగావాట్‌ గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేసేందుకు 500 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయని సమావేశంలో పాల్గొన్న ఎస్సార్‌ క్యాపిటల్‌ పార్టనర్‌ సునీల్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement