Friday, November 22, 2024

ప్ర‌వీణ్ ‘పాంచ్’ ప‌టాకా …అంగ‌ట్లో ప్ర‌శ్నాప‌త్రాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాలకు సంబంధించి రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లీకేజీకు సంబంధించిన ప్రధాన నిందితుడైన ప్రవీణ్‌ లీలలు అన్నీ ఇన్నీ కావు. ఒకవైపు ప్రశ్నపత్రాలు లీకులు.. మరో వైపు సెల్‌ఫోన్‌లో యువతుల న్యూడ్‌ వీడియోలు, ఫొటోలు. ఇంతే కాకుండా సిట్‌ అధికారులు విచారణ జరుపు తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. టీఎస్‌ పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ వ్యవహారం తాజాగా మరో కీలక మలుపు తీసుకుంది. కేవలం ఒక పేపర్‌ కాదు.. ఏకంగా నిందితుడు ప్రవీణ్‌ మొత్తం 5 పరీక్షా పేపర్లను కంప్యూటర్‌ నుంచి కొట్టేసినట్లుగా సిట్‌ విచారణలో తేలినట్లు సమాచారం. టీఎస్‌పీఎస్‌సీ అధికారులతో భేటీ అయిన సిట్‌ ముఖ్యఅధికారులు.. టీఎస్‌పీఎస్‌సీలోని ఓ ఉద్యోగిని దగ్గర నుంచి పాస్‌వర్డ్‌ను ప్రవీణ్‌, రాజశేఖర్‌ ఎప్పుడు? ఎలా? కొట్టేశారన్న అంశంపై ఆరా తీసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే నిందితుడు ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పోలీసులు పంపించారు. పెన్‌డ్రైవ్‌ను విశ్లేషించిన అధికారులు అందులో ఐదు ప్రశ్నపత్రాలు కాపీ చేసుకున్నట్లు గుర్తించినట్లు తెలిసింది. పక్కా ప్లాన్‌ ప్రకారమే ప్రవీణ్‌ పేపర్‌ లీకులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రవీణ్‌కు లబ్ధి చేకూర్చేందుకు టీఎస్‌పీఎస్‌సీ కంప్యూటర్‌ లాన్‌లో రాజశేఖర్‌ పలు మార్పులు చేసినట్లు తెలిసింది. రాజశేఖర్‌ సహాయంతోనే ప్రవీణ్‌ పేపర్‌ బాంచ్‌ కొట్టేసినట్లు తెలిసింది. తనదగ్గరున్న పెన్‌డ్రైవ్‌లో ఆ పేపర్లని ప్రవీణ్‌ సేవ్‌ చేసుకున్నట్లు తెలిసింది. ఈనెల 5వ తేదీన జరిగిన ఏఈ పరీక్షతో పాటు, 12వ తేదీన జరగాల్సిన టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ పరీక్ష పేపర్లను సైతం ప్రవీణ్‌ కొట్టేశాడు. అంతేకాకుండా భవిష్యత్తులో జరగబోయే అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగ నియామక పేపర్లను కూడా ప్రవీణ్‌ తన దగ్గరే పెట్టుకున్నాడు. అయితే సమయం చూసి ఈ పేపర్లను విక్రయించాలని ప్రవీణ్‌ ప్రణాళిక వేసుకున్నాడు.

భవిష్యత్తులో జరిగే పేపర్లన్నింటినీ మరొక నిందితురాలైన రేణుకకు ఇస్తానని ప్రవీణ్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఏఈ పరీక్షతో పాటు మిగిలిన నాలుగు పరీక్షలను రాయబోయే అభ్యర్థులను వెతికి పట్టాలని రేణుకకు ప్రవీణ్‌ చెప్పినట్లు విచారణలో తేలింది. వెతికిపెట్టడమే కాకుండా ప్రశ్నపత్రాలకు బేరమాడి పెట్టాలని ప్రవీణ్‌ చెప్పినట్లు తెలిసింది. కేవలం ఈ ఐదు పేపర్లే కొట్టేశాడా? లేక ఇంకా ఎన్ని పేపర్లు కొట్టేశాడు అన్న కోణంలో మరింత సమాచారాన్ని రాబట్టడం కోసం సిట్‌ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఏఈ, టౌన్‌ ప్లానింగ్‌, అసిస్టెంట్‌ సర్జన్‌, ఎంవీఐ, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌లోని పోస్టుల పరీక్ష పేపర్లను ప్రవీణ్‌ కొట్టేసినట్లు తేలడంతో అందులో ఏఈ పరీక్ష ఈనెల 5న జరిగింది. పేపర్‌ లీక్‌ కావడంతో ఆ పరీక్షను టీఎస్‌పీఎస్‌సీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 12 జరగాల్సిన టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ పరీక్ష, ఈనెల 15, 16వ తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ ఇప్పటికే వాయిదా వెసిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన ఎంవీఐ, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌లోని పోస్టుల పరీక్ష పేపర్‌లు కూడా కొట్టేశాడని పోలీసుల విచారణలో తాజాగా తేలడంతో వీటిని రద్దు చేస్తారా? లేదా? అనేది ఇంకా అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది. ఈ రెండు పరీక్షలు ఏప్రిల్‌ నెలలో జరగాల్సి ఉంది. ఏప్రిల్‌ 23న ఎంవీఐ పరీక్షతో పాటు అదేనెలలో గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఏఈ పరీక్ష పేపర్‌తో పాటు మిగిలిన 4 పేపర్లను కూడా ఎవరికైనా విక్రయించాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ వీటిని కూడా లీక్‌ చేసి ఉంటే ఇప్పటికే తయారు చేసిన ప్రశ్నపత్రాలను మరోక సారి కొత్తగా రూపొందించాల్సి ఉంటుంది.

మరీ ఈ పరీక్షల సంగతేంటీ?..
టీఎస్‌పీఎస్‌సీ మొత్తం 26 నోటిఫికేషన్లు వేయగా అందులో ఈ ఏడాది జనవరిలో ఉమెన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్టులకు పరీక్ష జరిగింది. జనవరి 22న అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌ పరీక్ష, ఫిబ్రవరి 26న డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. వీటితో పాటు సీడీపీవో, ఏఈ, ఏఈఈ, ఫుడ్‌ సేఫ్టీఆఫీసర్‌ తదితర పరీక్షలు నిర్వహించింది. ఇందులో ఏఈ(సివిల్‌) పరీక్ష పేపర్‌ లీక్‌ కావడంతో ఆ పరీక్షను ఇప్పటికే రద్దు చేశారు. ఇప్పటికే జరిగిన, జరగబోయే పరీక్షల్లో ఇంకేమైనా పేపర్లు లీకైనయా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే గతంలో ఎప్పటి నుంచే ప్రవీణ్‌తో రేణుకకు సాన్నిహిత్యం ఉన్న కారణంగా తన సోదరుడి కోసం ప్రవీణ్‌ను ప్రశ్నపత్రం అడగ్గా కంప్యూటర్‌ నుంచి పేపర్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఆ యువతికి ప్రవీణ్‌ వాట్సాప్‌ చేశాడు. దాన్ని క్యాష్‌ చేసుకోవాలని భావించిన ఆ యువకుడు తన స్నేహితులతో బేరమాడాడు. అయితే డబ్బులు ఇచ్చే విషయంలో తేడాలు రావడంతో అందులోని మరో యువకుడు 100కు డయల్‌ చేసి పేపర్‌ లీక్‌ విషయాన్ని బయటపెట్టినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement