ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కుమార్ కాంగ్రెస్ నేతలతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రాహుల్‌తో ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఉత్తరాఖండ్ నేత హరీష్ రావత్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాషాయేతర పార్టీలను కలుపుకునిపోయే వ్యూహాలపైనా ప్రశాంత్ కిషోర్‌తో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపినట్టు సమాచారం. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో ఇటీవల ప్రశాంత్ కిషోర్ వరుస భేటీలు, చర్చించిన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది కాగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ పార్టీ కోసం పని చేస్తానని కొద్దిరోజుల క్రితమే ప్రశాంత్ కిషోర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.