రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాదయాత్రకు రెడీ అయ్యారు. ‘జన్ సూరజ్’ ప్రచారంలో భాగంగా రేపు (ఆదివారం) మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ యాత్ర చేపడుతున్నారు. పశ్చిమ చంపారన్ జిల్లా నుండి బిహార్‌లో 3,500 కిలోమీటర్ల మేరకుఈ ‘పాదయాత్ర’ సాగనుంది. యాత్ర దాదాపు 12-18 నెలల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది అతని తాజా రాజకీయ ప్రవేశానికి నాందిగా భావిస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు.
అయితే.. ప్రశాంతి కిషోర్ యాత్రలో ప్రతి పంచాయతీ, బ్లాక్ని టచ్ చేస్తారని.. ఎటువంటి విరామం లేకుండా ఈ యాత్ర సాగుతుందని తెలుస్తోంది. 1917లో జాతిపిత తన మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన పశ్చిమ చంపారన్, భితిహర్వాలోని గాంధీ ఆశ్రమం నుంచి ప్రశాంత్ కిశోర్ తన పాదయాత్ర ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
ఇక.. గతంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను బహిరంగంగా విమర్శించి సంచలనంగా మారారు. ముఖ్యంగా కిషోర్ 2018లో రాజకీయ నాయకుడిగా స్వల్పకాలిక ఇన్నింగ్స్ కోసం JD(U)లో చేరారు. అయితే.. ప్రస్తుతం రాష్ట్రానికి కేవలం ప్రభుత్వ మార్పు అవసరం లేదని, వ్యవస్థను మార్చడానికి మంచి ఉద్దేశం ఉన్న వ్యక్తులు కలిసి రావాలని ఆయన ఉద్ఘాటించారు..
ఇక..అట్టడుగు స్థాయిలో సరైన వ్యక్తులను గుర్తించడం, వారిని ప్రజాస్వామ్య వేదికపైకి తీసుకురావడం సహా యాత్రలో మూడు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయని తెలుస్తోంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలతో సహా వివిధ రంగాలలోని నిపుణుల నుండి అభిప్రాయాలను తీసుకోవడం ద్వారా రాష్ట్రానికి విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..