ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో రానున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీ పెడుతున్నట్లు పీకే ప్రకటించారు. బీహర్ నుంచి తన ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్‌లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సొంత కుంపటి పెట్టుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా బీహార్‌లో నిన్న భావసారూప్య పార్టీలతో పీకే చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తోంది.
కాగా, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పీకే ఇటీవల తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీని ప్రక్షాళన చేసి జవసత్వాలు నింపేందుకు కొన్ని సూచనలు కూడా చేశారు. అయితే, పార్టీలోకి ఆయన రాకను కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు వ్యతిరేకించారు. ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐప్యాక్ దేశంలోని వివిధ పార్టీలకు పనిచేస్తుండడం, అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పీకే చర్చలు జరపడంతో ఆయన తీరుపై కాంగ్రెస్ నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్‌లో పీకే చేరికకు ఫుల్‌స్టాప్ పడింది.