మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా) ఎన్నికలు వివాదంలో కీలక పరిణామాం చోటుచేసుకుంది. మా ఎన్నికల్లో గెలిచిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా చేశారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలను ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో తమ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ”మా’ సంక్షేమం కోసం.. తమ ప్యానెల్ నుంచి గెలిచినవారు అంతా రాజీనామా చేస్తున్నారని తెలిపారు. తన ప్యానల్‌లో గెలిచిన ఎనిమిది మంది ఈసీ మెంబర్లు శివారెడ్డి, బ్రహ్మాజీ, ప్రభాకర్, తనీష్, సురేష్ కొండేటి, కౌశిక్, సుడిగాలి సుధీర్, సమీర్‌లతో పాటు శ్రీకాంత్, ఉత్తేజ్, బెనర్జీలు కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. తమ సభ్యుల రాజీనామాలను మంచు విష్ణు ఆమోదించాలని ప్రకాష్ రాజ్ కోరారు.
ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న ఘటనలపై తన ప్యానెల్ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌లో అన్యాయం జరిగిందన్నారు. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తీసుకొచ్చారన్న ప్రకాష్ రాజ్.. రాత్రికి రాత్రే ఫలితాలు మారాయని పేర్కొన్నారు. తమ ప్యానెల్‌లోని సభ్యులంతా బయటకు వచ్చి.. ‘మా’ సభ్యుల తరపున నిలబడతామని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. తెలుగువాడు కాని వ్యక్తి మా ఎన్నికల్లో పోటీ చేయకూడదని మీరు మార్చకపోతే ‘మా’ సభ్యత్వానికి నేను చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటానని ప్రకాష్ రాజ్ చెప్పారు.