గత ఏడాది ఇండోనేషియాలో భూకంపాలు సంభవించగా పెద్ద ఎత్తున ప్రాణ..ఆస్తి నష్టం సంభవించిన సంగతి విదితమే..కాగా తాజాగా ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది.వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోనేషియాలోని తువాల్ ప్రాంతానికి 342 ఆగ్నేయ దిశలో స్థానిక కాలమానం మధ్యాహ్నం 2:47 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. అలాగే ఇండోనేషియాకు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియా, తూర్పు తైమూర్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయని యూరోపియన్ సిస్మోలాజికల్ సెంటర్ పేర్కొంది.
రాబోయే కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల్లో మరో భూకంపం వచ్చే అవకాశం ఉందని ఈఎంఎస్సీ హెచ్చరించింది. భూ ప్రకంపనల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు ప్రజలు దూరంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఆస్ట్రేలియా, తూర్పు తైమూర్‌లో కూడా భూకంపం సంభవించింది. రాబోయే కొద్దిరోజుల పాటు భూకంపం సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బలమైన భూకంపం వచ్చినప్పటికీ సునామీ హెచ్చరిక జారీ చేయలేదు.